మహిళల టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా  గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి మ్యాచ్ లో విజయకేతనం ఎగురవేసిన భారత్ తాజాగా మరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్ల లో 6వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఈమ్యాచ్ కు జ్వరం కారణంగా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన దూరం కావడంతో ఆమె స్థానంలో వచ్చిన తానియా భాటియా నిరాశ పరచగా మరో ఓపెనర్  షఫాలీ వెర్మ  మెరుపులు మెరిపించింది. కేవలం 17బంతుల్లో 4 సిక్సర్లు ,2 ఫోర్ల సాయంతో షఫాలీ 39పరుగులు చేయగా రోడ్రిగస్ (34) ఆమెకు సహకరించింది. 
 
అయితే మరింత దూకుడుగా ఆడే క్రమంలో షఫాలీ అవుట్ కాగా ఆ తరువాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కృష్ణమూర్తి 11 బంతుల్లో 20రన్స్ చేయడం తో భారత్ పర్వాలేదనే  స్కోర్ చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్ల లో 8వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్ల లో  పూనమ్ యాదవ్ 3, షికా పాండే 2, అరుంధతి రెడ్డి 2 వికెట్లు తీసుకోగా రాజేశ్వరి ఓ వికెట్ పడగొట్టింది. ఇక సుడిగాలి ఇన్నింగ్స్ తో  చెలరేగిన  షఫాలీ వెర్మ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: