హర్యానా అమ్మాయి కడపలో అదరగొట్టేసింది.. నాలుగున్నర ఓవర్లలోనే ప్రత్యర్థి జట్టును మట్టికరిపించింది. కేవలం 12 పరుగులిచ్చి.. తానొక్కతే అందరినీ ఔట్ చేసేసింది. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచింది 16 ఏళ్ల చండీగఢ్‌ అమ్మాయి కాశ్వీ గౌతమ్. 

 

వివరాల్లోకి వెళ్తే.. బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 మహిళల అంతర్రాష్ట్ర పోటీల్లో హర్యానా యువతి ప్రపంచ రికార్డు సృష్టించింది. కడప వేదికగా జరుగుతున్న అండర్-19 అంతర్రాష్ట్ర మహిళల క్రికెట్ పోటీలలో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కకావికలం చేసింది.మీడియం పేసర్ కాశ్వీ గౌతమ్... 4.5 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు పడగొట్టింది. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది. 

 

కడపలో ఈనెల 19 నుంచి బీసీసీఐ అండర్-19 మహిళల అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌ కెప్టెన్ కాశ్వీ గౌతమ్ ఈ రికార్డు నమోదు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చండీగఢ్‌ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటిన కాశ్వీ... 49 పరుగులు చేసింది. అనంతరం అరుణాచల్‌ప్రదేశ్ జట్టు కాశ్వీ మీడియం పేస్‌ ధాటికి కేవలం 8.5 ఓవర్లలోనే 25 పరుగులకు కుప్పకూలింది. 

 

సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కాశ్వీ గౌతమ్ చండీగఢ్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్లస్ వన్ చదువుతోంది. ఏడో తరగతిలోనే క్రికెట్ ఆడటం ఆరంభించింది. తర్వాత  రెండేళ్లలోనే చండీగఢ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లోనూ  సత్తా చాటింది. అండర్-23 విభాగంలో 31 వికెట్లు తీసి ఆల్ ఇండియా రికార్డు నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: