ఐసీసీ ఉమెన్స్ టీ-ట్వంటీ వరల్డ్ కప్ తుది దశకు చేరకుంది. టోర్నీ ఆరంభం నుంచి అపజయమే ఎరుగని టీమిండియా ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. 

 

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది. తొలి సారి పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ ఫైనల్‌కి చేరింది. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్‌ వర్షం కారణంగా రద్దవడంతో హర్మన్‌ప్రీత్‌ సేన సెమీస్‌ ఆడకుండానే నేరుగా ఫైనల్‌ చేరింది. గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుత టోర్నీలో టీమ్‌ఇండియా గ్రూప్‌-ఎలో వరుసగా నాలుగు లీగ్ మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌ 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రన్‌రేట్‌ పరంగా ఇంగ్లాండ్‌, భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నప్పటికి లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమిండియా ఫైనల్స్‌కు చేరింది. 

 

అటు రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫైనల్‌లోకి దూసుకొచ్చింది. ఐసీసీ నిర్వహించే మెగాటోర్నీల్లో దక్షిణాఫ్రికాకు ఏ రీతిలోనూ అదృష్టం కలసి రాదని మరోసారి రుజువైంది. వర్షం పడి మ్యాచ్‌ రద్దయినా, మ్యాచ్‌ మధ్యలో వర్షం పడకున్నా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకునేది. కానీ వరుణుడు ఆస్ట్రేలియా వైపే నిలిచాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో దక్షిణాఫ్రికాపై ఐదు పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరడం వరుసగా ఆరోసారి. ఇప్పటివరకూ ఆ జట్టు నాలుగు సార్లు కప్ కైవసం చేసుకుంది.

 

మెల్‌బోర్న్‌లో ఆదివారం జరగబోయే ఫైనల్‌లో టీమిండియాతో ఆసీస్ అమీతుమీకి సిద్దమైంది. ఒకే గ్రూపు నుంచి వచ్చిన రెండు టీమ్‌లు ఫైనల్‌కి చేరడం విశేషం. అయితే అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే మనోళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో ఆస్ట్రేలియా పటిష్టంగా ఉంది. అంతే కాదు సొంత గడ్డపై మ్యాచ్ జరగనుండటం కంగారులకు అడ్వాంటేజ్. అయితే గ్రూప్‌ దశలో ఆసీస్‌ను ఓడించడం ఓ రకంగా టీమిండియా కాన్ఫిడెన్స్‌ను పెంచుంతుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక టోర్నిలో దుమ్మురేపుతోన్న యువ సంచలనం షెఫాలీ వర్మ మరోసారి చెలరేగితే సగం పని అయిపోయినట్లే. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, స్మృతి, జెమీమా రోడ్రిగ్స్‌ సత్తా చాటితే టీమిండియాకు తిరుగులేనట్లే.

 

నాలుగు సార్లు టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌ అయిన ఆసీస్‌ ఐదో సారి కప్‌ సాధిస్తుందా? లేక ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ తొలి సారి కప్‌ను ముద్దాడుతుందా? అనేది తెలియాలంటే ఆదివారం జరిగే ఫైనల్స్‌ వరకు వేచిచూడాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: