కరోనా వైరస్ ప్ర‌భావంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని రంగాలు దెబ్బ‌తింటున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోతున్నాయి. ఈ క్ర‌మంలో క్రీడారంగం కూడా స్తంభించిపోయింది. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలు వాయిదా ప‌డుతున్నాయి. ఇక క్రీడాకారులు ఇళ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. క్వారంటైన్‌లోనే గ‌డుపుతున్నారు. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టోక్యో కేంద్రంగా నిర్వ‌హించ‌నున్న‌ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ నిర్వ‌హ‌ణ‌ ఏకంగా ఏడాదిపాటు వాయిదా ప‌డింది. ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా మరో టోర్నీ ఈ జాబితాలో చేరింది. అంతకంతకు ప్రమాదకరంగా మారుతున్న  కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావంతో ఏప్రిల్‌ 27 నుంచి మొదలుకావాల్సిన జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వాయిదా పడింది.

 

కరోనా వ్యాధి నిరోధాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింద‌ని.. ఈ కారణంగా లక్నోలో వచ్చే నెలలో జరుగాల్సిన 84వ జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నామ‌ని భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బాయ్‌) ప్ర‌క‌టించింది. షెడ్యూల్‌ ప్రకారం టోర్నీ  జరుగకపోవడం నిరాశ కల్గిసున్నా..విశ్వమారి కరోనాను ఎదుర్కొనేందుకు ఇంతకుమించిన మార్గం మరోకటి లేదని.. పరిస్థితి  అదుపులోకి వచ్చాక అందరం ఒకసారి సమావేశమై టోర్నీ ఎప్పుడు జరుపాలో నిర్ణయం తీసుకుంటామ‌ని బాయ్ జనరల్‌ సెక్రెటరీ అజయ్‌ సింఘానియా తెలిపారు.

 

నిజానికి.. క‌రోనా ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో టోర్నీల‌కు పంపేందుకు ఆయా దేశాలు, కుటుంబ స‌భ్యులు కూడా ఒప్పుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప్ర‌తిష్టాత్మ‌క విశ్వ‌క్రీడ‌లు వాయిదా వేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.  ఇదే స‌మ‌యంలో క్రీడాకారులు కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి స్టే ఎట్ హోం అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. భార‌త్ స్టార్ క్రికెట‌ర్ విరాట్‌కోహ్లీతోపాలు ప‌లువురు క్రీడాకారులు ఇలా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాతే అన్నిరంగాలు మ‌ళ్లీ త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్న‌యని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: