అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక వివాదాలకు కారణమైన బాల్‌ ట్యాంపరింగ్‌ ఇకపై నేరం కాదా? ఐసీసీనే స్వయంగా దీనిని లీగల్ చేయబోతోందా? బంతిని స్వింగ్ చేసేందుకు దానిని పాలిష్‌ చేయడం తప్పేం కాదంటారా?  ప్రస్తుతం ఐసీసీలో జరుగుతున్న పరిణామాలు వీటికి అవుననే సమాధానం చెప్తున్నాయి.

 

అంతర్జాతీయ క్రికెట్‌లో గతంలో బాల్ ట్యాంపరింగ్ అనేక వివాదాలకు తావిచ్చింది. చాలా మంది ప్లేయర్లు తమ కెరీర్‌లను నాశనం చేసుకున్నారు. అనేక మంది ఈ వివాదంలో చిక్కుకుని శిక్షలు కూడా అనుభవించారు. ఐసీసీ కూడా దీనిపై ఇప్పటి వరకూ చాలా కఠినంగా వ్యవహరించింది. నిబంధనలకు విరుద్ధంగా మైదానంలో ఎవరైనా బాల్‌ను పాలిష్ చేస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. 

 

బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్ము, చెమట ఉపయోగించడం క్రికెట్ లో మామూలుగా జరిగే అంశాలే. అయితే కరోనా దెబ్బకు ఇకపై ఇలా చేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా లక్షణాలున్న వ్యక్తి బంతిపై ఉమ్మితే.. మ్యాచ్‌లో పాల్గొన్న వాళ్లందరికీ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అందులోనూ ఒకే బంతిని మైదానంలో అందరూ తీసుకోవడం అంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే. దీంతో వేరే వస్తువుల ద్వారా టాంపరింగ్‌ చేసే అవకాశం కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. వచ్చే మేలో జరిగే టెక్నికల్‌ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, దీన్ని అంపైర్ల సమక్షంలోనే చేయాలన్న నిబంధన కూడా పెట్టాలని ఐసీసీ భావిస్తోంది.

 

బాల్‌ను మాలిష్‌ చేయకపోతే స్వింగ్ చేయడం కష్టంగా మారుతుంది. ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడం బౌలర్లకు పెద్ద సవాలుగా మారనుంది. అయితే టాంపరింగ్‌ను అధికారికం చేయడమే దీనికి పరిష్కారమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్యాండ్ పేపర్‌ లేదా లాలాజలం ఉపయోగపడే ద్రావణం లాంటివి అనుమతించవచ్చని తెలుస్తోంది. 

 

క్రికెట్‌లో బాల్‌ టాంపరింగ్‌ కొత్తేమీ కాదు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా వార్నర్‌, స్మిత్‌ల సూచన మేరకు బాన్‌క్రాప్ట్‌ బాల్ ట్యాంపరింగ్ చేయడమే అన్నింటికన్నా వివాదంగా మారింది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. స్మిత్ తన కెప్టెన్సీని కూడా వదులుకోవాల్సి వచ్చింది. అంతే కాదు ఆ తర్వాత అనేక సందర్భాల్లో వారు అవమానానికి గురి కావాల్సి వచ్చింది. స్టేడియాల్లో పలువురు ప్రేక్షకులు బహిరంగంగానే వారిని అవహేళన చేసే కామెంట్స్ చేశారు. 

 

స్మిత్, వార్నర్‌ కంటే ముందు కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే ఇకపై టాంపరింగ్‌ చేసినా కూడా ఎలాంటి శిక్షా ఉండకపోవచ్చు. ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయడాన్ని నేరంగా పరిగణిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తమ నిబంధనలు సడలించే అవకాశం కనిపిస్తోంది. బాల్‌ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉంది. అంపైర్ల పర్యవేక్షణలో బంతిని పాలిష్‌ చేసేందుకు అనుమతిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

 

పరిమిత ఓవర్ల క్రికెట్లో తెల్ల బంతితో సమస్య కాకున్నా.. టెస్టుల్లో ఎర్ర బంతితో పేసర్లు ప్రభావం చూపించాలంటే దానిని పదే పదే పాలిష్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఇరు వైపులా స్వింగ్‌ను రాబట్టేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు నిబంధనలకు లోబడి నోటి ఉమ్ము, చెమటను ఉపయోగించి బాల్‌ను పాలిష్ చేసేవారు. దీంతో దీనికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్నట్టు ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్‌ ముందుకెళ్లాలంటే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఐసీసీ భావిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: