భారత దేశంలో గత కొంత కాలంగా కరోనా వల్ల లాక్ డౌన్  ప్రకటించారు. దాంతో వలస కార్మికులు అందరు ఇతర ప్రదేశాల్లో చిక్కుకున్నారు.  ఈ మద్య వారంతా స్వస్థలాలకు వెళ్లొచ్చు అని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఎన్నో అవస్థలు పడుతోన్న విషయం విదితమే. అయితే, పరాయిరాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను స్వరాష్ట్రాలను చేర్చడానికి ఎందరో దాతలు సహాయం చేస్తున్నారు అలాంటి వారికి ఎంతోమంది అండగా నిలుస్తున్నారు. బాలీవుడ్ లో సోనూ సూద్ అయితే ఇప్పుడు వలస కార్మికులకు పెద్దన్నగా ముందుకు వస్తున్నాడు.

 

అమితాబచ్చన్ సైతం బస్సులు ఏర్పాటు చేస్తూ ఎంతో మందికి అండగా ఉన్నారు. తాజాగా  టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ కూడా వలస కూలీలకు తన వంతు సహాయాన్ని చేశారు. కాలినడకన స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు ఆహారం, మాస్క్‌లు, శానిటైజేర్ అందించాడు. ఇందుకోసం షమీ ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పూర్‌లో ఉన్న తన ఇంటి ముందు వలసదారుల కోసం సహాయక శిబిరాన్ని ప్రారంభించాడు. కొంత కాలంగా తాను వలస కార్మికుల దీన పరిస్థితి చూస్తున్నానని.. వారి బాధ ఎంతో వర్ణనాతీతంగా ఉందని అన్నారు.

 

ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. షమీ చేస్తున్న సేవకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షమీ చేస్తున్న నిస్వార్థ సేవకు క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొందరు క్రికెటర్లు ముందుకు వచ్చి వలస కూలీలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి వారికి సేవ చేయడం అందరి బాధ్యత అని.. కష్టాల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: