ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉండ‌గా  కరోనా వైరస్‌ కారణంగా నీలి మేఘాలు క‌మ్ముకుంటున్నాయి.  అనేక దేశాలు లాక్‌డౌన్‌లు పాటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ట్వి-20 సంగ్రామం సాగేనా..? అన్న అనుమానాలు అన్ని దేశాల క్రికెట్ బోర్డుల‌ను, క్రికెట్ అభిమానుల‌ను, క్రీడాకారుల‌ను వేధిస్తున్నాయి. వాస్త‌వానికి ఆస్ట్రేలియాలో జ‌రిగే ట్వీ-20పై చాలా దేశాలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. వ‌రల్డ్ క‌ప్ త‌ర్వాత అన్ని దేశాలు త‌మ సత్తాను నిరూపించుకునేందుకు ఈ టోర్నికి ప్రిపేర‌య్యాయి. అయితే ఆయా దేశాల్లో క‌రోనా వైర‌స్ ఉధృతి పెరుగుతుండ‌టం, ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తిచ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డం వంటి ఎన్నో అవాంత‌రాల‌తో ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ సాధ్యమేనా అన్న అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

 

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వెలువ‌డుతున్న స‌మాచారం ప్ర‌కారం...ఈ  టోర్నీని దాదాపుగా వాయిదా వేస్తారని తెలుస్తోంది. మే 28నే భవితవ్యం తేలాల్సింది. కానీ జూన్‌ 10కి నిర్ణయాన్ని ఐసీసీ వాయిదా ప‌డింది. ఇదిలా ఉండ‌గా ఈ టోర్నీ వాయిదా వేయ‌డం లేదా ర‌ద్దు చేయ‌డం వంటి అంశాల‌పై వివిధ దేశాల‌కు చెందిన క్రికెటర్లు, మాజీ క్రికెట‌ర్లు స్పందిస్తున్నారు. ఈక్ర‌మంలోనే పాకిస్తాన్ లెజెండ్ క్రికెట‌ర్ వ‌సీం అక్ర‌మ్ త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని వెల్ల‌డించాడు. ‘వ్యక్తిగతంగా ఇదంత మంచి ఆలోచన కాదని నా భావన. అభిమానులు లేకుండా క్రికెట్‌ ప్రపంచకప్‌ ఎలా నిర్వహిస్తారు.

 

 భారీ జన సందోహం ఉంటేనే మెగా టోర్నికి అందం..ఆక‌ర్ష‌ణ‌.. క్రికెట‌ర్ల‌లోనూ ఉత్సాహం నెల‌కొంటుంది. ఇవేవీ లేకుండా టోర్నీ నిర్వ‌హ‌ణ అనేది బాగుండ‌ద‌ని త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని పేర్కొన్నాడు. ట్వీ-20 నిర్వ‌హ‌ణ‌పై  ఐసీసీ కొన్ని రోజులు వేచి చూసి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తే బాగుటుంది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టాక, ఆంక్షలు తొలగించాక నిర్వహిస్తే బాగుంటుంది’ అని వసీమ్‌ అన్నాడు. ఇదిలా ఉండ‌గా బంతిపై ఉమ్మిని వాడటం ఐసీసీ తాత్కాలికంగా నిషేధించిన విష‌యం తెలిసిందే. అయితే పేస‌ర్ల‌కు ఇది కొంత అవాంత‌రంగా మారుతుంద‌ని, మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌కు ఆటంకంగా ఉంటుంద‌ని తెలిపాడు. దీనికి ప్ర‌త్యామ్నాయంగా బౌల‌ర్ల‌కు వెసులుబాట్లు క‌ల్పిస్తే బాగుటుంద‌ని అన్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: