ఈఏడాది మెన్స్ టీ 20 ప్రపంచ కప్ అలాగే వచ్చే ఏడాది ఉమెన్స్ ప్రపంచ కప్ నిర్వహించాలా లేదనే విషయం పై ఐసీసీ నాన్చుడు ధోరణినే కొనసాగిస్తుంది. వీటిపై చర్చించేందుకు నిన్న వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమైన ఐసీసీ సభ్యులు.. ఈ మెగా టోర్నీల నిర్వహణ పై ఎటు తేల్చకుండానే సమావేశాన్ని ముగించేశారు. వచ్చే నెలలో ఐసీసీ వార్షిక సమావేశం జరుగనున్న నేపథ్యంలో అప్పుడే  వీటిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కమిటీ ప్రకటించింది.
 
షెడ్యూల్ ప్రకారం అయితే అక్టోబర్ - నవంబర్ లో ఆస్ట్రేలియా లో టీ 20 ప్రపంచ కప్ జరగాల్సి వుంది కానీ కరోనా వల్ల ఇప్పుడు టోర్నీ జరగడం పై సందిగ్థత నెలకొంది. అయితే ఐసీసీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే టోర్నీ నిర్వహించాలని భావిస్తుంది. ఇదిలావుంటే  మూడు నెలల విరామం ఆనంతరం అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభం కానుంది. వెస్టిండీస్ -ఇంగ్లాండ్ లమధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. మూడు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు సోమవారమే ఇంగ్లాండ్ కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభంకానుంది. ఈటెస్టు సిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా జరుగనుంది.
 
ఇక భారత్, శ్రీలంకతో జరిగే సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ ను మళ్ళీ మొదలుపెట్టనుంది. ఆగస్టులో భారత్ , శ్రీలంక లో పర్యటించాల్సి వుంది. అందులో భాగంగా ఇరు జట్ల మధ్య వన్డే , టీ 20 సిరీస్ జరుగనున్నాయి.  ఈ పర్యటనకు బోర్డులు కూడా ఆమోదం తెలిపాయి కానీ ఇరు దేశాల ప్రభుత్వాల నుండి అనుమతి రావాల్సి వుంది. ఇక శ్రీలంక లో కరోనా ప్రభావం తగ్గడంతో ఈ పర్యటనకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: