ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండిస్ తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడంలో ఇంగ్లీష్ బౌలర్లు సఫలమయ్యారు. సౌతాంప్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 212 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 33.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.


ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జో రూట్ సెంచరీ నమోదు చేశాడు.  ఈ ఆటలో  28 ఏళ్ల రూట్ 94 బంతుల్లో 11 ఫోర్లతో అజేయ సెంచరీ చేశాడు. అంతకు ముందు పాకిస్తాన్‌ జట్టుపై సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు రూట్. హెట్‌మెయిర్, హోల్డర్‌ని ఔట్ చేసి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 


ఈ సెంచరీతో రూట్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో మూడు సెంచరీలు చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 2015 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన రూట్.. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు బాదాడు.  ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్ ఇద్దరిని ఔట్ చేశాడు. ఇక ప్లంకెట్, వోక్స్‌కి తలో వికెట్ దక్కింది.



మరింత సమాచారం తెలుసుకోండి: