నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను విజయం వరించింది . ఆఖరి బంతి వరకు విజయం ఇరు జట్లను దోబూచులాడింది . కానీ చివరకు విజయం ఇంగ్లాండ్ పక్షమే వహించింది . న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ప్రారంభించి 241 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు నిర్దేశించింది . జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు లక్ష్య ఛేదన లో 241 పరుగులు సాధించి ఆలౌట్ అయింది .


 దీనితో ప్రపంచ కప్ విజేతలను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ను ఆశ్రయించాల్సి వచ్చింది . సూపర్ ఓవర్ లోను ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి . తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 15 పరుగులు సాధించగా , జవాబుగా బ్యాటింగ్  ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 16 పరుగులు సాధించాల్సి ఉండగా , 15 పరుగులు మాత్రమే సాధించి సాంకేతికంగా ఓటమి పాలయింది . కానీ ప్రపంచ క్రికెట్ అభిమానుల మనస్సులను న్యూజిలాండ్ జట్టు దోచుకుంది . ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు లీగ్ దశ నుంచి మొదలుకుని నాకౌట్ స్టేజీలోనూ స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించింది .


 ప్రపంచకప్ చేజిక్కించుకున్నట్లే కన్పించిన ఆ జట్టు చివరి బంతికి ఓటమి పాలయింది . ఇంగ్లాండ్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అంతిమంగా క్రికెట్ విజయం సాధించిందనే చెప్పాలి . రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి . బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు స్ఫూర్తిదాయకమైన ఆటతీరు తో ప్రేక్షకులను అలరించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: