వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేశాడు. విండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి భార‌త్‌ను గెలిపించిన కోహ్లీ త‌న రికార్డుల ప‌రంప‌ర‌లో మ‌రో అరుదైన రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు (238 వన్డేల్లో 11,406) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ... 311 వన్డేల్లో 11,363 పరుగులు చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. 


ఓవ‌రాల్‌గా ప్ర‌పంచ వ‌న్డే మ్యాచ్‌ల చ‌రిత్ర‌లో ఎక్కువ ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. భార‌త మాజీ క్రికెట‌ర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ 463 వన్డేల్లో 18,426 పరుగులతో టాప్ స్పాట్‌లో కొనసాగుతున్నాడు. ఇక, విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు పాక్ మాజీ ఆట‌గాడు జావెందె మియాందాద్ పేరిట ఉండేది. విండీస్‌పై  64 ఇన్సింగ్స్‌లు ఆడి 2032 పరుగులు చేసిన ఆటగాడిగా పాక్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ పేరుతో ఉన్న రికార్డును సైతం బ‌ద్ద‌లు కొట్టేశాడు.


మియాందాద్ రికార్డును కోహ్లీ 26 సంవ‌త్స‌రాల త‌ర్వాత బ్రేక్ చేశాడు. కోహ్లీ ఈ రికార్డు బ్రేక్ చేసేందుకు కేవ‌లం 35 ఇన్సింగ్స్‌లు మాత్ర‌మే తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఓ జట్టుపై అత్యంత వేగంగా 2వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య కరీబియన్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ... రెండు సెంచరీలు చేసిన డెస్మండ్‌ హేన్స్‌ రికార్డును అధిగమించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: