ప్రస్తుతం భారత బౌలర్లు మరియు బ్యాట్సమెన్ విజృభించడం వల విశాఖలో సఫారీలతో జరిగిన తొలి టెస్టులో  టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించగా,  పుణేలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో టెస్టును కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనే యోచనలో ఉంది విరాట్‌ సేన. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలై సిరీస్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగలింది. 


ఆ జట్టు ఓపెనర్‌  మార్కరమ్‌ గాయం కారణంగా చివరి టెస్టుకు దూరమయ్యాడు. స్వీయ తప్పిదం కారణంగా చేతికి గాయం చేసుకుని సఫారీలకు షాకిచ్చాడు. రెండో టెస్టులో వరుస ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌ కావడంతో నిరాశకు గురైన మార్కరమ్‌ ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నాడు. దాంతో శనివారం నుంచి రాంచీలో ఆరంభం కానున్న చివరిదైన మూడో టెస్టు నుంచి వైదొలిగాడు. 


మార్కరమ్‌ కుడిచేయి మణికట్టుకు గాయం కావడంతో అతను జట్టుకు దూరమవుతున్న విషయాన్ని మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది.  దాంతో మార్కరమ్‌ ఉన్నపళంగా స్వదేశానికి పయనమయ్యాడు.దీనిపై మార్కరమ్‌ మాట్లాడుతూ.. ‘ సిరీస్‌ మధ్యలో ఇలా స్వదేశానికి పయనం కావాల్సి వస్తుందని ఊహించలేదు. ఇది చాలా బాధాకరం. నాకు గాయం కావడం కంటే కూడా క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టుకు దూరం కావడం ఎక్కువగా బాధిస్తుంది. 


ఇక్కడ క్షమించడం అనేది ఏమీ లేదు. ఇలా గాయం కావడానికి నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.  డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో నిరాశలో నా చేతికి గాయం చేసుకున్నా. కొన్ని సందర్బాల్లో నిరాశ కూడా మరింత మెరుగు కావడానికి దోహదం చేస్తుంది’ అని మార్కరమ్‌ పేర్కొన్నాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మార్కరమ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: