భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక 500వ టెస్టులో తొలి రెండు రోజులు కివీస్ జోరు కొనసాగించింది. తొలి రోజు భారత్ ఇన్నింగ్స్  దెబ్బతీసిన కివీస్.. రెండో రోజు బ్యాటింగ్లో మెరిసింది. వరుసగా దుమ్ములేపిన కివీస్ మూడో రోజుకు వచ్చేసరికి ఢీలా పడిపోయింది. 152/1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ను భారత్ చావుదెబ్బ తీసింది. బౌలర్లు అశ్విన్‌, జ‌డేజాలు చెలరేగిపోయారు. ఈ ఇద్దరి ధాటికి తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 262 ప‌రుగులకే ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ కు 56 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. జ‌డేజా అయిదు, అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్నారు.మూడో రోజు ఆటలో లాథమ్(58) రెండో వికెట్ గా అవుటైన తరువాత కివీస్ ఘోరంగా విఫలమైంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో రాస్ టేలర్ డకౌట్ గా వెనుదిరగగా, కెప్టెన్ విలియమ్సన్(75) బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, ఆ తరువాత ల్యూక్ రోంచీ(38), సాంట్నార్(32), వాట్లింగ్(21) మోస్తరుగా ఆడారు.  

చివరి మూడు వికెట్లలో ఇద్దరు కివీస్ బ్యాట్స్మెన్లు డకౌట్ గా పెవిలియన్ చేరడంతో కివీస్ 262 పరుగులకే పరిమితమైంది.  విరాట్ కోహ్లి నేతృత్వంలోనిభారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో  318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం భారత జట్టుకు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: