ఐపీఎల్‌12 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయంటే కారణం ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌. ఆడిన ప్రతి మ్యాచ్‌లో మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అంతేకాదు చివరి వరకు క్రిజులో నిలబడి విజయాలను అందించాడు. ప్రపంచకప్‌ జట్టు సన్నాహకంలో భాగంగా సొంత జట్టుతో కలవడానికి స్వదేశం వెళ్లిన వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సుదీర్ఘ పోస్టుతో అభిమానులకు గుడ్‌బై చెప్పాడు.


'మీరు చూపిన ప్రేమకు, మద్దతుకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ ఏడాదే కాదు, గతేడాది కూడా మద్దతుగా నిలిచారు. బాల్ టాంపరింగ్ నిషేద సమయంలో.. మళ్లీ సన్‌రైజర్స్‌ కుటుంబంలో చేరడానికి, కలిసి ఆడటానికి ఎంతో ఎదురు చూశాను. ఫ్రాంచైజీ యాజమాన్యం, ఆటగాళ్లు, సోషల్‌ మీడియా, అభిమానులు నా పునరాగమనానికి మంచి స్వాగతం పలికారు. టోర్నీ మొత్తం మీతో ఆడటం ఎంతో ఆస్వాదించాను. మిగిలిన టోర్నీలో మంచి విజయాలు అందాలని కోరుకుంటున్నా' అని వార్నర్‌ రాసుకొచ్చారు. 


ఈ సీజ‌న్ లో భీకరమైన ఫామ్‌లో ఉన్న వార్నర్‌.. వ‌రుస‌గా 85, 69, 100 నాటౌట్‌, 10, 15, 70 నాటౌట్‌, 51, 50, 67, 57, 37, 81 వ‌రుస‌ భారీ స్కోర్ల‌తో పాటు ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఒక సెంచరీ కూడా న‌మోదు చేసి ఆరెంజ్ క్యాప్ ను ద‌క్కించుకొని ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. బాల్ ట్యాంప‌రింగ్ వివాదం కార‌ణంగా సంవ‌త్స‌రం పాటు ఆస్ట్రేలియా టీమ్ లో స్థానం కోల్పోయి.. ఏడాదిగా క్రికెట్ కు దూర‌మై ఐపీఎల్ ద్వారా త‌న పున‌రాగ‌మ‌నాన్ని ఘ‌నంగా చాటాడు వార్న‌ర్.


ఇదే ఫాం కొన‌సాగించి వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ త‌న స‌త్తా చాటాల‌ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అభిమానులంద‌రూ కోరుకుంటున్నారు.  ఈ దశలో డేవిడ్ వార్నర్ స్వదేశానికి వెళ్లిపోవడం సన్‌రైజర్స్‌ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. కనీసం మన జట్టు ఫైనల్‌కు చేరితే అప్పుడైన రావాలని సోషల్‌ మీడియా వేదికగా అర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: