వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 హంగామా మొద‌లైంది. మే 30 నుంచి ఇంగ్లండ్‌, వేల్స్‌లో ప్రారంభమయ్యే వ‌ర‌ల్డ్ క‌ప్ వేడుకకు అంతా సిద్ధ‌మైంది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ ఎగ‌రేసుకుపోయే లిస్టులో ఇండియాతో పాటు ఇంగ్లండ్‌, ఆసీస్‌ జట్లు శ‌క్తివంతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మిగతా జట్లు కూడా త‌మ బ‌లం పెంచుకునే ప‌నిలో ప‌డ్డాయి.  
 
ఈసారి వ‌ర‌ల్డ్ కప్‌ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా 4 మిలియన్‌ డాలర్ల నగదు బహుమతి అందించ‌బోతోంది. 4 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 28 కోట్ల రూపాయ‌ల‌కుపైగానే. అలాగే రన్నరప్‌కు రెండు మిలియన్‌ డాలర్లు.. అంటే 14 కోట్ల రూపాయ‌లు, సెమీఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు.. అంటే దాదాపు 5కోట్ల రూపాయ‌ల‌కుపైగా అందుతాయి. లీగ్‌ దశలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకుంటారు. ఇక లీగ్‌ దశలోనే ఇంటికి వెళ్లే ప్రతీ జట్టుకు లక్ష డాలర్లు నగదు నజరానా అందిస్తారు. 
 
మే 30 నుంచి జులై 14 వరకు 46 రోజుల మ‌హా సంగ్రామం కొనసాగనుంది. 45 మ్యాచులు రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరుగుతాయి. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాలి. లీగ్‌దశ ముగిసేసరికి ఎవరైతే ఫ‌స్ట్ 4 స్థానాల్లో నిలుస్తారో వారే సెమీఫైనల్‌కు వెళ‌తారు. జులై9న ఎడ్జ్‌బాస్టన్‌లోని ఓల్డ్‌ ట్రఫోర్డ్‌లో ఒక సెమీఫైనల్‌,  11న ఎడ్జ్‌బాస్టన్‌లోని బర్మింగ్‌హామ్‌లో మరో సెమీఫైనల్‌ జరుగుతుంది. ఇక చివరగా జులై 14న ప్రతిష్ఠాత్మక మైదానం లార్డ్స్‌లో ఫైన‌ల్ పోరు న‌రాలు తెగ ఉత్కంఠ‌గా సాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: