క్రికెట్‌ ప్రేమికులు దాదాపు నాలుగు సంవత్సరాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఇండియా – పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ సమరానికి నేడు తెరలేవనుంది. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటేనే నరాలు బిగుసుకుపోయే ఉత్కంఠ, ఉద్వేగం. ఇరు దేశాల అభిమానులే కాదు, క్రికెట్‌ ప్రేమికులంతా ఈ సమరం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కూడా టీమిండియానే ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నదనడంలో సందేహంలేదు. పాక్‌తో పోలిస్తే టీమిండియా చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో భారత్‌కు ఎదురులేదు. మరోవైపు ప్రపంచకప్‌లో అజేయ రికార్డులతో ఉన్న భారత్‌ తమ ఖాతాలో మరో విజయాన్ని వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

వరల్డ్‌కప్‌ సమరంలో భారత్‌-పాక్‌లు మొత్తం 6 సార్లు తలపడితే. అందులో భారత్‌ ఏకపక్షంగా అన్ని మ్యాచుల్లో విజయాలు సాధించి రికార్డు సృష్టించింది. 1992 నుంచి 2015 వర కు ముఖాముఖి పోరులో పాక్‌ను భారత్‌ చిత్తు చేస్తూనే వచ్చింది. ఇక ఈసారి కూడా అదే జోరును పునరావృతం చేయాలని కోహ్లీ సేన భావిస్తోంది. ట్రోఫీ ఫేవరెట్‌గా ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌ మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుటోంది. తొలి రెండు మ్యాచుల్లో ప్రపంచ అగ్రశ్రేణి జట్లు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలను ఓడించిన టీమిండియా ఇప్పుడు దాయాది పోరులో పాకిస్తాన్‌నూ సైతం నిలువరించాలని ఆతృతగా ఉంది. నిలకడైన బ్యాటింగ్‌ లైనప్‌, ప్రపంచ టాప్‌ క్లాస్‌ బౌలింగ్‌ విభాగంతో భారత్‌ పాక్‌ కంటే చాలా మెరుగ్గా ఉంది. మరోవైపు పాక్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఈ ప్రపంచకప్‌లో పటిష్టమైన ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించి తమ ఉనికిని చాటుకుంది.

ఇప్పుడు భారత్‌తో అగ్ని పరీక్షకు సిద్ధమవుతోంది. యువ పేసర్‌ అమీర్‌ ఖాన్‌ పాక్‌కు ప్రధాన అస్త్రంగా మారాడు. మంచి నైపుణ్యమైన ఉన్న ఈ బౌలర్‌ స్వింగ్‌తో భారత బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీయాలని భావిస్తున్నాడు. ఇతనితో పాటు వాహబ్‌ రియాజ్‌ కూడా మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు ప్లస్‌ పాయింట్‌. బ్యాటింగ్‌లోనూ పాక్‌ పటిష్టంగానే ఉంది. అందుకే ఆదివారం దాయాదుల పోరు హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే చాలా మంది అభిమానులు మాంచెస్టర్‌ చేరుకున్నారు. మరోవైపు టీవీల్లోనూ రికార్డు స్థాయిలో ప్రేక్షకులు వీక్షించనున్నట్టు సమాచారం. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్ష గండం కనిపిస్తోంది. ఆదివారం ఇక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. వర్షం కారణంగా ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌ రద్దయింది. ఇక పాక్‌ మ్యాచ్‌లో వరుణుడు అడ్డుపడకూడదని అభిమానులు కోరుకొంటున్నారు.


ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌ మరో విజయంపై కన్నేసింది. దాయాదుల పోరుకు కోహ్లీ సేన అన్ని విధాలుగా సిద్ధమైంది. స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడి మూడు మ్యాచ్‌లకు దూరమైన అతని స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేశాడు. ఓపెనర్‌గా రాహుల్‌కు మంచి అనుభవమే ఉంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ పాక్‌పై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతనికి తోడుగా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెలరేగితే టీమిండియాకు మరోసారి అదిరే ఆరంభం ఖాయం. వీరిద్దరిలో ఎవరు విఫలమైనా వన్‌డౌన్‌లో సారథి విరాట్‌ కోహ్లీ జట్టును ఆదుకునేందుకు రెడీగా ఉన్నాడు. 


ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న కోహ్లీ ప్రపంచకప్‌లోనూ జోరును ప్రదర్శిస్తున్నాడు. పాక్‌పై కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 2015 టోర్నీలో  సెంచరీతో పాక్‌ బౌలర్లను చీల్చి చెండాడాడు. ప్రపంచకప్‌లో పాక్‌పై శతకం సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు సృష్టించాడు. మరోవైపు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ భారత్‌కు అదనపు బలం. ధోనీ తన అపార అనుభవంతో టీమిండియాను గెలుపు బాటలో నడిపించగలడు. మిడిల్‌ ఆర్డర్‌లో కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, విజయ్‌ శంకర్‌లో ఎవరికి అవకాశం లభించినా సత్తా చాటగలరు.


ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య టీమిండియాకు కీలక అస్త్రం. ఈ యువ ఆటగాడు బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టించగలడు. ఇక బౌలింగ్‌లోనూ భారత్‌కు తిరుగులేదు. ప్రపంచ నెంబర్‌వన్‌ బుమ్రాతో పాటు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీలు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కుల్దిప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌ తమ స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెట్టడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: