క్రికెట్ చరిత్రలో ఇంత కంటే బిగ్ మ్యాచ్ ఉండదంటే అతిశయెక్తి కాదేమో .. ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాల క్రికెట్ మ్యాచ్ అంటే అదో తెలియని భావోద్వేగం. వాన కారణంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆగినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ..ఈ మ్యాచ్ మాత్రం కచ్ఛితంగా జరగాల్సిందేనని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కోట్లాది మంది ఆశలు ఇలా ఉన్న వేళ.. మాంచెస్టర్ లో పరిస్థితి ఎలా ఉందన్నది చూస్తే.. అక్కడ వాతావరణం మ్యాచ్ జరిగేందుకు సానుకూలంగా ఎంతమాత్రం లేదన్న మాటను చెబుతున్నారు.


ఇంగ్లండ్ లోని వాతావరణం గురించి అంచనా వేసే ఏజెన్సీలన్ని మ్యాచ్ కు వరుణుడి కరుణ లేదని తేల్చి చెబుతున్నారు. మ్యాచ్ జరిగే సమయానికి వానకు అవకాశం ఉందంటున్నారు. మధ్యాహ్నం తర్వాత వాన మరింత పెరగటం ఖాయమంటున్నారు. శనివారం వాతావరణం బాగానే ఉండి.. కాస్త ఎండ కూడా కాసింది. భారత జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టిన కాసేపటికే వర్షం మొదలైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల వేళలోనూ మాంచస్టర్ లో వర్షం భారీగా కురిసింది.


పిచ్ ను కవర్లతో కప్పి ఉంచినా ఔట్ ఫీల్డ్ పనితీరుపైన సందేహాలు ఉన్నాయి. చిన్న జల్లులకే మైదానంలో పలు చోట్ల వర్షం నీళ్లు నిలిచిపోవటం గమనార్హం.ఈ మ్యాచ్ మీద పెద్ద ఎత్తున బిజినెస్ నడుస్తుందన్న ఆశలు పెట్టుకున్నవారికే కాదు.. పలు విభాగాలు పెద్ద ఎత్తున నష్టాలు మూటకట్టుకోవటం ఖాయమంటున్నారు. మ్యాచ్ జరగకుండా అంతా నష్టమేనని.. ఇది దాదాపు వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మ్యాచ్ కోసం రూ.20వేల వరకూ ఖర్చు పెట్టి కొన్న అభిమానుల పరిస్థితి దారుణంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: