భారతదేశంలో క్రికెట్ అంటే ఆట కాదు. ఒక మతం. అంతటి క్రేజ్ ఉంది. ఇక ఆటగాళ్లనైతే దేవుళ్ళే మనకి. క్రికెట్లో మన దేశం ఎన్నో విజయాలను సాధించింది. మరెన్నో ఘన విజయాలు నమోదు చేసింది. దేశం గర్వంగా చెప్పుకోదగ్గ విజయాల్లో ప్రముఖమైన గెలుపు 1983 లో భారత జట్టు వరల్డ్ కప్ నెగ్గటమే. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్ కప్ లో పలు దేశాలు పాల్గొంటాయి. వరల్డ్ కప్ నెగ్గటమే ఏ దేశపు కలైనా.

 

ఆ కలను మన భారత్ నెరవేర్చుకుని 36 ఏళ్లు పూర్తయ్యాయి. 25 జూన్’ 1983 వ తేదీన కపిల్ దేవ్ సారధ్యంలోని భారత జట్టు బలమైన వెస్టిండీస్ జట్టును ఫైనల్ లో ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ లో “క్రికెట్” అంటే.. 1983 కు ముందు, ఆ తరువాత అన్నట్టు మారిపోయింది. నిజానికి ఆ వరల్డ్ కప్ లో భారత్ మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ గ్రూప్ లోనే వెస్టిండీస్ ను ఓడించింది. సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ కు వెళ్లింది. ఫైనల్ లో ప్రత్యర్ధి వెస్టిండీస్. అప్పటికే వరుసగా రెండు సార్లు జగజ్జేత. ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులకే ఆలౌటైంది. ఇక విజయం వెస్టిండీస్ దే అనుకున్నారు. గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వివ్ రిచర్డ్, క్లైవ్ లాయిడ్.. లాంటి ఉద్దండులు తమ భీకర బ్యాటింగ్ తో కప్ ను మూడోసారి ఎగరేసుకుపోతారనే అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా భారత ఆటగాళ్లు సమిష్టిగా ఆడి వెస్టిండీస్ ను 140 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ జట్టు క్రికెట్లో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కెప్టెన్ కపిల్ దేవ్ సగర్వంగా వరల్ట్ కప్ ను ముద్దాడి భారతీయులకు కానుకగా ఇచ్చాడు.

 

ఈ విజయం భారత్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ ఒక మధురానుభూతే. ఈ తరం వారు కూడా ఆ విజయం గురించి తెలుసుకుని గర్వపడతారు. ఎన్నో సంచలనాలకు ఆ వరల్డ్ కప్ నెలవు. లీగ్ లో జింబాబ్వేపై కపిల్ దేవ్ 175 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ అద్భుతం అప్పుడే జరిగింది. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో కపిల్ ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ నేటికీ ఎందరో ఆటగాళ్లకు స్ఫూర్తి అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ తరువాత భారత్ లో క్రికెట్ పట్ల మరింత మంది ఆకర్షితులయ్యారు. ఎందరో ఆటగాళ్లు వచ్చారు. సచిన్ టెండూల్కర్ అయితే క్రికెట్ దేవుడే అయ్యాడు. 1983 తరువాత మళ్లీ భారత్ 2011 లో ధోనీ సారధ్యంలో వరల్డ్ కప్ అందుకుంది. 2019లో ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ లో కోహ్లీ సారధ్యంలో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆ నాటి మ్యాజిక్ రిపీట్ చేసి ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ను ముద్దాడుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. క్రికెట్ అభిమానులు కూడా 1983 నాటి కపిల్ సేన పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుని భారత్ కు వరల్డ్ కప్ అందించాలని కోరుకుంటున్నారు. మనం కూడా 2019 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ సాధించాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: