భారతీయులకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. క్రికెట్ భారతీయుల జీవనశైలిలో ఓ భాగం. వేదిక ఎక్కడైనా అక్కడికి వెళ్లి భారత జట్టుకు మద్దతు తెలుపుతూ వారిలో ఉత్సాహం నింపుతారు. అంతటి అభిమానం ఈసారి కొత్తగా ఆవిష్కృతమైంది. నిన్న బంగ్లాదేశ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో ఒక బామ్మ మ్యాచ్ ఆద్యంతం ఉత్సాహంగా కేరింతలు కొట్టి సందడి చేసింది. ఆమె.. 87 ఏళ్ల చారులతా పటేల్.

ఇండియా ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు బూర ఊదుతూ, చప్పట్లు కొడుతూ గ్యాలరీలో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న కోట్లాది మందిని రోహిత్ శతకం కంటే ఈ బామ్మ సరదానే ఆకట్టుకుంది. ప్రతి రీప్లేలో ఇండియా కొట్టిన షాట్ చూడటం కంటే ఈ బామ్మ సందడి చూడాలన్న ఆత్రమే ఎక్కువమందిలో కలిగిందంటే అతిశయోక్తి కాదు. అంతగా సెన్షేషన్ సృష్టించింది ఈ బామ్మ. బామ్మగారు చేసిన సందడికి ఫిదా అయిపోయిన రోహిత్ శర్మ, కోహ్లీ మ్యాచ్ అనంతరం ఆమె వద్దకు వెళ్లి ముచ్చటించారు. బామ్మ వారిని ఆప్యాయంగా ముద్దాడింది. క్రికెటర్లు ఆమె ఆశీర్వదం తీసుకున్నారు. ఆ వయసులో మ్యాచ్ జరిగినంత సేపూ స్టేడియంలో కూర్చోవడమే కాకుండా, సందడి చేస్తూ ఉత్సాహపరచటం కోట్లాదిమందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం బామ్మ చేసిన సందడి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

 

బామ్మచేసిన సందడికి ముగ్దుడైన మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇండియా ఆడే మ్యాచ్ లకు ఆమె వెళ్లాలని, ఖర్చులన్నీ తానే భరిస్తానని ప్రకటించడం విశేషం. సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ కూడా. ఒళ్లంతా జాతీయ పతాకం రంగులు, సచిన్ నెం.10 ని బాడీపై పెయింట్ వేసుకుంటాడు. ప్రపంచంలో భారత్ ఆడే ఏ మ్యాచ్ వీక్షణకు వచ్చినా సచినే అతని ఖర్చులన్నీ భరించేవాడు. ఈ ఉదాహరణలు చాలవూ.. భారతీయులకు క్రికెట్ కు ఉన్న అవినావ సంబంధమేంటో..!


మరింత సమాచారం తెలుసుకోండి: