క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను కలచివేసింది. ఏ క్రికెటరైనా వరల్డ్ కప్ కు ఆడాలన్నదే అంతిమ లక్ష్యం. ఇందులో రాయుడు మినహాయింపు కాదు. మంచి ట్రాక్ రికార్డు వున్నా.. రిజర్వ్ ఆటగాడిగా తీసుకున్నా.. జట్టులో ఇద్దరు ఆటగాళ్లు గాయపడినా..  రాయుడుకు అవకాశమివ్వకుండా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ ను తీసుకోవడం వెనుక బీసీసీఐ కుట్ర ఉందా..! ఏం ఆశించి మయాంక్ ను తీసుకున్నారు.. ఏం చేయలేదని రాయుడును ఎంపిక చేయలేదంటూ.. సగటు క్రికెట్ అభిమాని ప్రశ్నిస్తున్నాడు. 2003 వరల్డ్ కప్ లో ఇవే రాజకీయాలకు వీవీఎస్ లక్ష్మణ్ బలైపోయాడు. మంచి ఫామ్ లో ఉన్న లక్ష్మణ్ ను కాదని ఊసులోలేని దినేశ్ మెంగియాను సెలక్టర్లు ఎంపిక చేయడంతో దేశం యావత్తూ విస్తుబోయింది. బోర్డు రాజకీయాలకు అప్పట్లో లక్ష్మణ్, ఇప్పుడు రాయుడు బలైపోయారు. ఇద్దరికీ వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు. విచిత్రం ఏమిటంటే ఇద్దరూ తెలుగు వారే కావడం!  


రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సెకన్లలోనే సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెటిజన్లు  బీసీసీఐను దూనమాడారు. మీ కుళ్లు రాజకీయాలకు, కుల జాఢ్యానికి ఒక క్రికెటర్ ను బలి చేశారు. RIP బీసీసీఐ అంటూ తమ ఆవేశాన్నివెళ్లగక్కారు. రాయుడు నిర్ణయంపై వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ షాక్‌ను వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. రాయుడు కోపాన్ని, బాధను తాను అర్ధం చేసుకోగలనన్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజ‌మాన్యం.. ఇంతటి నిర్ణయం తమకు విఘాతమని, ఇది నిజం కాకూడదని సింగిల్ లైన్ ట్వీట్ చేసింది. గౌతమ్ గంభీర్ సైతం.. సెలక్టర్లందరి రన్స్ కలిపినా రాయుడు కెరీర్ లో సాధించినన్ని పరుగులు లేవని బీసీసీఐ నిర్ణయాన్ని గేలి చేశాడు. “ఏపీలో ఉన్న కుల‌జాఢ్యం క్రికెట్ కూ పాకేసింది. దీని ఫ‌లితమే.. రాయుడు రిటైర్మెంట్” అనే విమర్శలూ వస్తున్నాయి. రాయుడు కేరీర్ అర్ధాంత‌రంగా ముగియ‌డం వెనుక బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్, తెలుగు వాడైన ఎమ్మెస్కే ప్రసాద్ కుట్ర ఉందని, ఆయ‌న వ‌ల్లే అంబ‌టి కేరీర్ ముగిసింద‌ని నెటిజన్లు ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు.


ప్రతి ట్వీట్ ఎమ్మెస్కేను తప్పుపడుతూనే వస్తున్నాయి. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారు. రాష్ట్రంలోని రెండు కులాలకు చెందిన వారు. రాయుడు కాపు, ఎమ్మెస్కే కమ్మ కులానికి చెందిన వారు. ఈ అంశాన్నే నెటిజన్లు లేవదీస్తున్నారు.
కులాల అంతరం కారణంగానే రాయుడును ఎమ్మెస్కే అడ్డుకున్నాడని తిట్టిపోస్తున్నారు. కులం కార్డు పట్టుకుని, రికమండేషన్ తో పదవులు తెచ్చుకున్న నీకు కష్టం విలువ ఏం తెలుస్తుందంటూ ఎమ్మెస్కేను తిట్టిపోస్తున్నారు. “విశాఖ స్టేడియంలో ఒకవైపు ఎంట్రీకి ఎమ్మెస్కే ఎంట్రీగా పెట్టి.. తొలి తెలుగు సెలక్టర్ అని రాశారు. కానీ భారత తొలి టెస్ట్ క్రికెెట్ కెప్టెన్ సీకే నాయుడు పేరు ఏ స్టేడియం ఎంట్రన్స్ పేరు ఉండదని ఉదహరిస్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజమెంతో తెలీదు కానీ విమర్శలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతుండడం విచారకరం. రాయుడు — ఎమ్మెస్కే మధ్య "3D గ్లాసెస్" పై ట్వీట్ వార్ కూడా జరిగింది. దీంతో అంబటి రిటైర్మెంట్ కు ఎమ్మెస్కేనే కారణమంటూ విమర్శిస్తున్నారు.


ఏదైతేనేం.. ఓ క్రికెటర్ క్రీడా జీవితం ముగిసిపోయింది. ఎన్నో ఆశలతో క్రికెట్లోకి అడుగుపెట్టిన ఆ ఆటగాడు స్వార్ధపూరిత, కుత్సిత రాజకీయాలకు బలైపోయాడు. అతని మానసిక సంఘర్షణకు ఎవరిది బాధ్యత? ప్రతిభ ఉన్నవాడ్ని కూడా చేతకానివాడ్నిగా చేసాయి ఆ అధికారాలు. ఒక ఆటగాడి క్షోభను తమ విజయంగా భావించేవాళ్లు  ఉన్నంత కాలం భారత్ లో ఇలాంటి వేదనలు వినిపిస్తూనే ఉంటాయి. నిజంగా.. కులమే రాయుడు రిటైర్మెంట్ కు కారణమైతే క్రీడలోకానికే RIP.


మరింత సమాచారం తెలుసుకోండి: