సెమిస్ లో టీమిండియా ఓటమి అభిమానుల గుండెలు పగిలలే చేసింది. సునాయాసంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ చేజారిపోయేసరికే అభిమానులు తీవ్ర నిరాశలోకి పోయారు. తేలిగ్గా గెలిచేస్తామనుకున్న మ్యాచ్‌ని కఠినంగా మార్చేసుకుని, చివరికి న్యూజిలాండ్‌ బౌలర్ల ముందు సరెండర్‌ అయిపోవడం బాధాకరమే. ఆట అన్నాక గెలుపోటములు సహజమే. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ చాలా బలంగానే కన్పించింది.. ఒకటి రెండు సందర్భాల్లో మినహాయిస్తే. ఓపెనర్లు రాణించడం, ఓపెనర్లకు తోడుగా కెప్టెన్‌ కోహ్లీ మంచి ఫామ్‌లో వుండడం టీమిండియాకి బాగా కలిసొచ్చింది.


కానీ, ఆ ముగ్గురూ ఒక్కొక్క పరుగు చేసి వికెట్‌ పారేసుకోవడంతో, టీమిండియా పరాజయం ఖరారైపోయింది సెమీస్‌లో. చివర్లో మహేంద్రసింగ్‌ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడారు.. ఓ దశలో జట్టుని గెలిపించేస్తారన్న నమ్మకాన్నీ అభిమానుల్లో కలిగించారు. కానీ, అద్భుతాలు జరగలేదు.. న్యూజిలాండ్‌ నెగ్గింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చతికిలపడితే, మారిన వాతావరణ పరిస్థితుల్ని చక్కగా ఉపయోగించుకున్న న్యూజిలాండ్‌ ఫైనల్‌కి వెళ్ళింది. రాహుల్ చేతులెత్తేయకపోతే, రోహిత్‌ చెత్తగా బ్యాటింగ్‌ చేసి వుండకపోతే, కోహ్లీ వికెట్‌ పారేసుకోకుండా వుండి వుంటే.. ఇలా చాలా విశ్లేషణలు మామూలే.


కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూడోసారి టీమిండియా వరల్డ్‌ కప్‌ సాధిస్తుందని ఆశించిన అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. ఇక్కడ ఎవర్నీ తప్పు పట్టడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, మిగతా అన్ని మ్యాచ్‌లలోనూ బాగా ఆడేశారు కాబట్టి.  అయినాగానీ, అభిమానుల ఆక్రోశం కట్టలు తెంచుకోకుండా వుంటుందా.? చాలామందికి గుండె పగిలింది. సెలబ్రిటీలు తమ గుండె పగిలిన వైనాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: