2019 వరల్డ్ కప్ సమరం తుది అంకానికి చేరుకుంది. 46 రోజుల సుదీర్ఝ షెడ్యూల్ లో పది జట్లు హోరాహోరీగా పోరాడాయి. అనేక ఉత్కంఠ భరిత మ్యాచ్ లు జరిగాయి. అంతిమంగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ రెండు జట్లు గతంలో ఒక్కసారి కూడా వరల్డ్ కప్ నెగ్గలేదు. దీంతో ఈసారి ఏ జట్టు గెలిచినా తొలిసారి కప్ అందుకుని క్రికెట్ వరల్డ్ చరిత్రలో తమకంటూ తమకంటూ ఓ పేజీ లిఖించుకోనుంది.

 

క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్, ఒక్కసారి కూడా వరల్డ్ కప్ అందుకుని విజేతగా నిలబడలేకపోయింది. ఇప్పటివరకూ జరిగిన 11 వరల్డ్ కప్ పోటీల్లో మూడుసార్లు (1975,1987,1992) ఫైనల్ కు వెళ్లింది. మూడుసార్లూ వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఇంగ్లాండ్ ను ఓడించి విజేతగా నిలిచాయి. దీంతో ఇంగ్లాండ్ కు వరల్డ్ కప్ అందని ద్రాక్షే అయింది. వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టు 2015లో మాత్రమే ఫైనల్ కు వెళ్లింది. ఆ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈసారి (2019) వరుసగా రెండోసారి ఫైనల్ కు వెళ్లింది. ఫైనల్ ఫోబియాను దాటుకుని ఈసారి ఫైనల్ లో కప్ ఎవరు గెలిచినా అది చరిత్రే అవుతుంది.

 

జెంటిల్ మెన్ గేమ్ గా పిలిచే క్రికెట్లో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే దేశాలుగా న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ జట్లకు పేరుంది. దీంతో క్రికెట్ ప్రేమికులు ఈసారి సరికొత్త క్రికెట్ మజా చూడనున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రెండు జట్ల బలాబలాలు సమానంగానే ఉన్నాయి. తొలిసారి కప్ అందుకునే క్రమంలో న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ జట్లు మైదానంలో చిరుత వేటను తలపించేలా ఉన్నాయి. ఫైనల్ జరిగే లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ కు ట్రాక్ రికార్డు సరిగా లేదు. పైగా మూడుసార్లు ఫైనల్ లో చతికిలపడింది. మరి.. విలియమ్ సన్, మోర్గాన్ లలో ఎవరు తమ దేశానికి ఈ 2019 వరల్డ్ కప్ ను బహుమతిగా అందించి చరిత్రలో నిలిచిపోతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: