టీమ్‌లో కీలకమైన నెం.4 స్థానం కోసం సరైన బ్యాట్స్‌మెన్‌ని అన్వేషించడంలో విఫలమైన సెలక్టర్లు.. ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఆఖరి మ్యాచ్‌ వరకూ ఓ స్పష్టతకి రాలేకపోయారు. దీంతో.. వరల్డ్‌కప్‌లో తొలుత నెం.4లో కేఎల్ రాహుల్ ఆడగా.. ఆ తర్వాత విజయ్ శంకర్.. ఆఖర్లో రిషబ్ పంత్ ఆడాడు. మొత్తంగా.. అందరూ విఫలమై.. మళ్లీ సమస్యని మొదటికి తెచ్చారు. దీంతో.. సెలక్టర్లు ఇన్నాళ్లు నెం.4 ఆటగాడ్ని తయారు చేసుకోకుండా ఏం చేస్తున్నారు..? అంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


తాజాగా ఆ జాబితాలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా చేరాడు. భారత మాజీ స్టార్ క్రికెటర్ సెలెక్టర్ల మీద విమర్శలు కురిపించారు. అంబటి రాయుడితో సెలక్టర్లు వ్యవహరించిన తీరు నన్ను నిరాశపరిచింది. వరల్డ్‌కప్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో నెం.4లో ఆడిన రాయుడు అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో.. అతను కచ్చితంగా ప్రపంచకప్ జట్టులోకి ఎంపికవుతాడనుకున్నాం. కానీ.. ఆ సిరీస్ తర్వాత మూడు నాలుగు మ్యాచ్‌ల్లో అతను విఫలమయ్యాడు.


అంతే.. అతడ్ని జట్టు నుంచి తప్పించేశారు. ఆ తర్వాత రిషబ్ పంత్‌కి చోటిచ్చారు. అతను విఫలమవగానే వెంటనే వేటు వేశారు. వన్డే జట్టులో నెం.4 స్థానంలో ఆడే బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడాలని మీరు నిజంగా ఆశించినట్లయితే.. అతనికి మద్దతుగా సెలక్టర్లు నిలవాలి. అంతేతప్ప.. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమవగానే తప్పించేయకూడదు’ అని యువరాజ్ ఘాటుగా చురకలేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: