2019 క్రికెట్ వరల్డ్ కప్ మహా సంగ్రామానికి అద్భుతమైన ముగింపు లభించింది. ఎన్నో మలుపుల మధ్య ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచి వరల్డ్ కప్ ని ముద్దాడింది. 44 ఏళ్ల సుదీర్ఘమైన కలను నేరవేర్చుకుని సొంతగడ్డపైనే సగర్వాంగా కప్ అందుకుంది. అయితే.. ఇక్కడ న్యూజిలాండ్ కూడా విజేతనే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించింది. రూల్స్ ప్రకారమే ఇంగ్లాండ్ విజేత. బలాబలాల ప్రకారం ఇద్దరూ సమానమే.


మ్యాచ్ తోపాటు సూపర్ ఓవర్ కూడా టై కావడంతో విజేత ఎవరో మొదట అర్ధం కాని పరిస్థితి. టోర్నీలో ఎక్కువ బౌండరీలు సాధించిన వారే విజేతలు అనే ఐసీసీ రూల్ ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. న్యూజిలాండ్ తక్కువ లక్ష్యాన్నే ఉంచినా దాన్ని ఛేస్ చేయనీకుండా ఇంగ్లాండ్ ను నిలువరించి అద్బుత ఆటతీరుని ప్రదర్శించింది న్యూజిలాండ్. సూపర్ ఓవర్ కూడా టై అయింది కాబట్టి ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తే సబబుగా ఉండేది. బూజుపట్టిన చెత్త రూల్స్ కు న్యూజిలాండ్ బలైంది. బౌండరీలే ఇంగ్లాండ్ విజయానికి ప్రామాణికమైతే తక్కువ బౌండరీలతో కూడా 241 చేసిన న్యూజిలాండ్ కూడా గొప్పే. బౌండరీలు తప్ప ఇంగ్లాండ్ వికెట్ల మధ్య పరుగెట్టలేకపోయిందనేగా అర్ధం. న్యూజిలాండ్ 241 పరుగులకు 8 వికెట్లు మాత్రమే కోల్పోతే, ఇంగ్లాండ్ అదే 241 పరుగులకు ఆలౌటయింది. ఇక్కడ కూడా న్యూజిలాండ్ దే పైచేయి. మరి న్యూజిలాండ్ ఓడిపోయినట్టు ఎలా ప్రకటిస్తారు. రన్ రేట్ ప్రకారంగా చూసినా న్యూజిలాండే విజేతగా నిలిచేది. రూల్స్ ఫాలో కావాల్సిందే.. నిజమే! సూపర్ ఓవర్ కూడా టై అయితే రెండు జట్లనూ విజేతగా ప్రకటించాలి అని రాసుకుని ఉంటే ఈ రోజు న్యూజిలాండ్ కష్టానికి కూడా విలువ దక్కేది.


ఫైనల్ మ్యాచ్ చూసిన ఎవరికైనా న్యూజిలాండ్ కష్టం మరచిపోలేరు. న్యూజిలాండ్ ఒక్కో వికెట్టే తీస్తూ చివరి బంతి వరకూ ఇంగ్లాండ్ ను కట్టడి చేసి ఆలౌట్ చేసింది. అయినా దురదృష్టం న్యూజిలాండ్ ను వెంటాడింది. ఇప్పటికైనా కొన్ని చెత్త నిర్ణయాలను ఐసీసీ మార్చుకోవాలి. ఒకప్పుడు లేని ప్లేఆఫ్ లు, బౌండరీ లైన్ కుదింపు, ఎల్బీలకు ధర్డ్ ఎంపైర్ నిర్ణయం.. వంటివి చేసినప్పుడు ఇలాంటి బూజు పట్టిన చెత్త నిర్ణయాలను మార్చుకోవడం ఐసీసీకి పెద్ద కష్టమేమీ కాదు.


ఫైనల్ గా.. ఏ గుప్తిల్ అయితే ధోనీని అద్భుత రనౌట్ చేసి న్యూజిలాండ్ ఫైనల్ వెళ్లడానికి కారణమయ్యాడో.. అదే గుప్తిల్ లాస్ట్ ఓవర్ లో త్రో చేసిన బాల్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి ఫోర్ వెళ్లిపోయేలా చేసి సొంత జట్టు భారీ మూల్యం చెల్లించేలా చేశాడు. లేకపోతే ఇంత కథ జరిగేది కాదు.. కనీసం ఒక్క పరుగు తేడాతో అయినా న్యూజిలాండ్ కప్ ఎగరేసుకుపోయేది. ఇక్కడ ఎవరిదీ తప్పు కాదు. అదృష్టం మాత్రమే రెండు జట్లతో దోబూచులాడి చివరికి ఇంగ్లాండ్ పక్షాన నిలిచింది.. అంతే!


మరింత సమాచారం తెలుసుకోండి: