ప్ర‌పంచ క్రికెట్‌కు పరిచ‌యం అక్క‌ర్లేని పేరు అత‌నిది. విమ‌ర్శ‌ల‌కు త‌న ఆట‌తోనే స‌మాధానం చెప్తున్న మౌన‌ముని త‌ను. కెప్టెన్‌గా, కీప‌ర్‌గా జ‌ట్టుకు ఎన్నో సేవ‌ల‌ను అందించిన త‌ను కెరీర్ చ‌ర‌మాంకంలో కూడా ఆట ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నాడు. ఇలా చెప్పుకొంటూ పోతే మాటలు కూడా సరిపోవంటే అందులో అతిశయోక్తి లేదు. అతనే భారత క్రికెట్‌ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ. 


ప్రపంచకప్‌లో ఆటపరంగా ధోనీ ప్రస్తుత ప్రదర్శనపై భిన్న రకాల స్వరాలు వినిపిస్తున్నా.. అతనెప్పటికీ గొప్ప క్రికెటరే అంటోంది ఐసీసీ. ఆదివారం ధోనీ 38వ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. విదేశీ క్రికెటర్లతో సహా భారత ఆటగాళ్లు, అభిమానులు ఆట పట్ల ధోనీకున్న అంకితభావం గురించి ఉద్వేగపూరితంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్‌ ద్వారా పంచుకుంది.


మ‌హేంద్ర‌సింగ్ ధోనీ.. ఆ పేరు భారత క్రికెట్‌ రూపాన్నే మార్చేసింది. ఆ పేరు లక్షల మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ పేరు కొట్టిపారేయలేని వారసత్వం.’ అంటూ ధోనీ కీర్తిని ప్రశంసిస్తూ ఐసీసీ గొప్పగా రాసుకొచ్చింది. ధోనీ తమనెంతగానో ప్రభావితం చేసినట్లు సారథి విరాట్‌ కోహ్లీ, ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ వీడియోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 


‘ఒక వ్యక్తిని బయటి నుంచి చూడటం వేరు. దగ్గర నుంచి చూడటం వేరు. ఎంత ఒత్తిడిలో ఉన్నా నిత్యం ప్రశాంతంగా ఉంటూ, ఆట పట్ల గొప్ప అంకితభావం చూపించే ధోనీ.. ఇప్పటికీ ఎప్పటికీ నా సారథే. ఎన్నో సందర్భాల్లో తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. ఫామ్‌పరంగా ప్రస్తుతం అతనెన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నా, తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తాడని మ్యాచ్‌పై అతనికి పూర్తి అవగాహన ఉంటుంది.’ అని కోహ్లీ పేర్కొన్నాడు. అలాగే.. ఇంగ్లాండ్ కీప‌ర్ జాస్ బ‌ట్ల‌ర్, ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ మ‌రియు అఫ్గాన్ వికెట్ కీప‌ర్ మ‌హ్మ‌ద్ షెహ‌జాద్ కూడా ధోనీ ఘ‌న‌త‌ల‌ను కొనియాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: