2019 వరల్డ్ కప్ ఫైనల్ అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య ముగిసింది. న్యూజిలాండ్ కే అర్హత ఉన్నా నాటకీయంగా ఇంగ్లండ్ కప్ ఎగరేసుకుపోయింది. బెన్ స్టోక్స్ తన ఆటతో ఇంగ్లండ్ కు హీరో అయినా కన్నతండ్రికి మాత్రం ఈ విజయం రుచించటంలేదు. ఇంగ్లండ్ విజయం కంటే న్యూజిలాండ్ పరాజయమే తననెక్కువ బాధించిందని అంటున్నాడు.

 

 

కారణం.. బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ దేశస్థుడు కాడు.. న్యూజిలాండ్ దేశస్థుడు. 1991లో న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో జన్మించాడు. ఇప్పుడు తాను పుట్టిన దేశం ఓడిపోవడానికి కారణమయ్యాడు. కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో కొంతమంది ఆ దేశస్థులు కారు. జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్ దేశస్థుడు. డబ్లిన్ లో పుట్టాడు. పదేళ్లక్రితం వరకూ ఐర్లాండ్ కు ఆడాడు. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రెండు నెలల క్రితం వరకూ ఇంగ్లండ్ పౌరసత్వం లభించలేదు. స్టార్ బ్యాట్స్ మెన్ జాసన్ రాయ్, టామ్ కుర్రన్ ఇద్దరూ సౌత్ ఆఫ్రికా దేశస్థులు. మరి ఈవిజయానికి ఇంగ్లండ్ ఎలా అర్హత పొందుతుందీ అంటే.. సాక్షాత్తూ బెన్ స్టోక్స్ తండ్రికే నచ్చనంత.

 

 

“బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ను, ఇంగ్లాండ్ విజయాన్ని ఎంతవరకూ ఆస్వాదించాలో అర్ధం కావటం లేదు. ఈ విజయంతో న్యూజిలాండ్ దేశం మొత్తం అసహ్యించుకునే వ్యక్తినయ్యాను”అని బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ అంటున్నాడు. “గెలుపుకు పూర్తిగా అర్హత ఉన్న న్యూజిలాండ్ ఓడిపోయినందుకు చాలా బాధపడుతున్నాను. స్టోక్స్ ఆటను, ఇంగ్లాండ్ విజయాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నా..! కానీ నేను ఇప్పటికీ న్యూజిలాండ్ సపోర్టర్ నే” అని అన్నాడు. దీనినిబట్టే అర్ధమవుతోంది ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయో.. జీవితంలో అదృష్టం పాత్ర ఎంతో!

మరింత సమాచారం తెలుసుకోండి: