ఇప్పుడు ఏ క్రీడాభిమానిని చూసినా ధోని రిటైర్మెంట్ గురించే చర్చిస్తుంటాడు. ప్రపంచకప్ అవ్వగానే అతను అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెబుతాడని అందరూ అంచనా వేశారు. కానీ ధోని వెంటనే నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ లోపు అతడి గురించి రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. ధోని ఇంకొంత కాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడంటూ తాజాగా ఒక ప్రముఖ ఇంగ్లిష్ డైలీ ఒక కథనం ప్రచురించింది.


ఆ కథనం భలే కామెడీగా ఉంది.దీని ప్రకారం ధోని భారత జట్టుతోనే ఇంకొంత కాలం కొనసాగుతాడట. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడట. ఇదంతా జట్టు కోసమేనట. త్వరలో ఆరంభమయ్యే వెస్టిండీస్ సిరీస్‌కు మాత్రం దూరంగా ఉండబోతున్న ధోని.. ఆ తర్వాత జరిగే సిరీస్‌లకు ఎంపికవుతాడట. ఐతే అతను 15 మంది సభ్యుల జట్టులో మాత్రమే ఉంటాడట. ఫైనల్ ఎలెవన్‌లోకి రాడట. వికెట్ కీపర్‌గా తన స్థానాన్ని భర్తీ చేయనున్న రిషబ్ పంత్‌ను గైడ్ చేయడం.. వ్యూహాల విషయంలో కోహ్లి, మిగతా ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం లాంటివి చేస్తాడట.


ఇలా కొంత కాలం జట్టులో కొనసాగి తన నిష్క్రమణ తర్వాత ఏర్పడే లోటును జట్టు ఎక్కువగా ఫీల్ కాకుండా చూస్తాడట. అలా ఒక ఆటగాడి మీద ఆధారపడితే అది దౌర్భాగ్య స్థితే అవుతుంది. ధోని విషయంలోనూ జట్టు అలా చేస్తుందని ఎవ్వరూ అనుకోవట్లేదు. అసలు ఇలాంటి వాటికి ధోని ఒప్పుకునే రకం కాదు. ఉండాలనుకుంటే ఆటగాడిగా ఉంటాడు. లేదంటే రిటైరవుతాడు. కానీ ఇలా నాటకీయ రీతిలో జట్టులో కొనసాగడానికి ఇష్టపడడు. ధోని మనస్తత్వం ప్రకారం చూస్తే మాత్రం అతను కొన్ని రోజుల్లో చడీచప్పుడు లేకుండా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలే ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: