2019 వరల్డ్ కప్ ఫైనల్ ను ఎవరూ అంత తేలిగ్గా మరచిపోలేరు. న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఇదొక చేదు ఘటన. ఆ బాధను వాళ్లు మరచిపోలేకపోతున్నారు. ఫైనల్ మ్యాచ్ లో 49, 50వ ఓవర్లు మర్చిపోవడానికి చాలా కష్టపడుతున్నారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌.. ప్రపంచకప్‌ తర్వాత స్వదేశం చేరుకున్నాక తొలిసారి ఫైనల్స్ లో ఓటమిపై స్పందించాడు. బౌండరీల ఆధారంగా ఫలితం, ఓడిపోవడం బాధగా ఉందని, అంత తేలిగ్గా మర్చిపోలేమని, ఈ బాధను జీర్ణించుకోడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందన్నాడు. 


ఫైనల్‌ మ్యాచ్‌లో నీషమ్‌ వేసిన 49వ ఓవర్‌, తాను వేసిన ఆఖరి ఓవర్ పదే పదే గుర్తొస్తున్నాయని, మరచిపోలేకపోతున్నానని అన్నాడు. 49వ ఓవర్లో తాను బెన్‌స్టోక్స్‌ క్యాచ్‌ను పట్టి బౌండరీలైన్‌ తాకడం, తాను వేసిన ఆఖరి ఓవర్లో స్టోక్స్‌ సిక్స్‌ కొట్టడం, ఇంగ్లాండ్‌కు అనుకోని పరుగులు రావడం... ఆ తర్వాత స్కోర్లు సమమవ్వడం చాలా విచిత్రంగా ఉందని బౌల్ట్‌ తెలిపాడు. ఈ రెండు ఓవర్లలో ఏ ఒక్కటి సవ్యంగా జరిగినా మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేదని బాధపడుతున్నాడు.


  
తమలా ఏ జట్టూ విజయానికి అంత చేరువకి వచ్చేదికాదని, అదొక అద్భుతమైన సందర్భమని పేర్కొన్నాడు. తమకు దక్కాల్సిన కప్పు ఇంగ్లాండ్‌ను వరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2015 ఫైనల్ ఓటమి కన్నా ఈ ప్రపంచకప్‌ ఓటమే తీవ్రంగా కలచివేస్తోందని, ఈ ఓటమి పట్ల తమ ఆటగాళ్లంతా చాలా బాధపడుతున్నారని బౌల్ట్‌ అన్నాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత తాను ఇంటికి వెళ్తున్నానని, ఈ సందర్భంగా తన పెంపుడు శునకంతో కలిసి బీచ్‌లో వాకింగ్‌కి వెళ్తానని అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: