ఆదివారం జరిగిన ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. జకర్తా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకిదిగిన సింధు అద్భుత ఆటతో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన సింధుకు ఈ విజయం పెద్ద ఊరటనిస్తుందని చెప్పాలి.

శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు 2119, 2110 తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యూఫీను చిత్తు చేసింది. ఆరంభ సెట్‌లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. చెన్ కూడా సింధుకు గట్టి పోటీ ఇస్తూ లక్షం దిశగా అడుగులు వేసింది. అయితే సింధు మాత్రం ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగింది.

చెన్ జోరును సమర్థంగా అడ్డుకుంది. ఇద్దరు పట్టు వీడకుండా పోరాడడంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. అయితే కీలక సమయంలో చెన్ ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సింధు సఫలమైంది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. కాగా, రెండో గేమ్‌లో మాత్రం భారత స్టార్ సింధుకు ఎదురులేకుండా పోయింది. ఆరంభం నుంచే తన మార్క్ షాట్లతో అలరించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది.

ఇదే క్రమంలో అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్లో జపాన్ స్టార్ అకానె యమగూచి విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు జపాన్ సంచలనం యమగూచితో తలపడుతుంది. ఇందులో గెలిస్తే సింధుకు సీజన్‌లో తొలి టైటిల్ దక్కుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: