ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి అంతర్జాతీయ స్టేడియాలను ఏర్పాటు చేయనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హాబ్ గా తీర్చే క్రమంలో అవసరమైన హంగులను సమకూర్చనున్నామని చెప్పారు. ఈ క్రమంలో  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో  అంతర్జాతీయ స్డేడియాలను  అభివృద్ధి చేస్తామని తద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని  మంత్రి తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని నాలుగోవ బ్లాక్ లో ప్రచార విభాగంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. క్రీడల అభివృద్ధికి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులకు ప్రోత్సహం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలపై సమీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు.  ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, పూర్తి అయిన, కావచ్చిన ప్రాజెక్టులపై చర్చ జరిగిందన్నారు. అదే విధంగా ఈ ఏడాది నుంచి ఏయే ప్రాజెక్టులు ముందుగా చేపట్టాలి అనే అంశంపై చర్చించామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టి జరుగుతున్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని సీఎస్ సూచించినట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 



ఆర్కియాలజీపై జరిగిన చర్చను మంత్రి ప్రస్తావిస్తూ విజయవాడలో త్వరలోనే బాపు మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. పురాతన దేవాలయాలను టూరిజం సర్క్యూట్ పరిధిలోకి తెచ్చే అంశంపై అధ్యయనం చేయాలని సీఎస్ సూచించినట్లు తెలిపారు. పురాతన దేవాలయాలను దేవాదాయ, పర్యాటక శాఖల పరిధిలోకి తెచ్చి పీపీపీ పద్ధతిన అభివృద్ధి చేయాలని యోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్టణంలో శిల్పారామాలున్నాయని, కొత్తగా స్థలం కేటాయిస్తే త్వరలోనే విజయవాడ, అమరావతి, శ్రీకాకుళం, కడప, కర్నూలులో పీపీపీ పద్ధతిలో నూతనంగా శిల్పారామాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనూ, యూనివర్సిటీ సహకారంతోనూ రాష్ట్రంలో స్టేడియాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయమై సంబంధిత వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ లతో చర్చించి శాప్ ద్వారా వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ప్రస్తుతం అలహాబాద్ లో పీపీపీ పద్ధతిలో స్టేడియం కొనసాగుతుందన్నారు. ఏపీలో  కూడా అదే విధంగా ఎవరైనా పీపీపీ పద్ధతిన ముందుకు వస్తే విజయవాడ, గుంటూరులో అంతర్జాతీయ స్టేడియం ఏర్పాటు చేయాడానికి సిద్ధమన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ భూములున్నాయని త్వరలోనే వాటిలో అంతర్జాతీయ స్టేడియాలను అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.


అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సత్తా చాటిన అమలాపురం కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌ ను ముఖ్యమంత్రి సమక్షంలో సన్మాన కార్యక్రమం ద్వారా అభినందిస్తామని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరపున అతనికి అభినందనలు తెలియజేస్తామని మంత్రి తెలిపారు. అదే విధంగా ఇటీవలే పోలాండ్ దేశంలో వెటరన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లి  అక్కడే మృతి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ జి.సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే ఈ విషయమై అధికారులతో మాట్లాడామని మంత్రి అన్నారు. ఆయన పార్థీవదేహాన్ని రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా క్రీడలను అభివృద్ధి చేస్తామని,  క్రీడాకారులను ప్రోత్సహిస్తామని  మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆ దిశగా స్పోర్ట్స్ క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సంవత్సరంలో ప్రతి నెల రాష్ట్రంలోని  ఒక్కో జిల్లాలో క్రీడలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభ వెలికితీసి గెలుపొందిన వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించి రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనేలా చేసి క్రీడలపై మక్కువ పెంచుతామన్నారు.


సాధారణంగా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు దురదృష్టవశాత్తు గాయపడితే క్రీడలకు దూరం అవ్వాల్సి వస్తుందని మంత్రి తెలిపారు. ఇకపై అలాంటి ఘటనలు ఏవైనా జరిగితే క్రీడలనుంచి తప్పుకోకుండా, త్వరగా రిటైర్ మెంట్ ప్రకటించకుండా వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకు గానూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో వైద్యం అందించి గాయపడిన క్రీడాకరులు త్వరగా కోలుకునేలా చేస్తామని, ఈ విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నామని మంత్రి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: