భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. కోట్లాది భారతీయుల గుండె గొంతుకను ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ధ్వనింపజేసింది. పదహారణాల అచ్చమైన మన తెలుగమ్మాయి సాధించిన అద్భుతమిది. దేశం మొత్తాన్ని గర్వించేలా చేసిన క్షణమిది. మువ్వెన్నల త్రివర్ణ పతాకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది తెలుగు తేజం.


వయసు కేవలం 24 ఏళ్లు... సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆరంభంనుంచి ఆఖరు దశకు చేరే వరకు ఎందరో స్టార్లు తలవంచిన చోట... సింధు మాత్రం ఉవ్వెత్తున ఎగిసింది. వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఈ హైదరాబాదీ అమ్మాయి.. చివరకు స్వర్ణ ముచ్చటను తీర్చుకుంది. ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా ఊరించిన పసిడి కల నెరవేరింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకుంది సింధు.  


గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం.. ఈసారి మాత్రం పసిడి సాధించే వరకూ వదల్లేదు.  ఫైనల్లో వరల్డ్‌ ఐదో ర్యాంకర్‌ పీవీ సింధు.. ప్రపంచ నాలుగో ర్యాంకర్‌  జపాన్‌ ప్లేయర్‌ నొజోమి ఒకుహారా పై గెలిచి జగజ్గేతగా అవతరించింది తెలుగమ్మాయి. రెండు గేమ్స్‌లో అలవోకగా  సాగిన పోరులో సింధు 21-7, 21-7 తేడాతో గెలిచి చాంపియన్‌ కలను నెరవేర్చుకుంది. తొలి నుంచి ఒకుహరా అంచనాలకు అందకుండా సింధు ఏకపక్షంగా ఆటను కొనసాగించింది. సుదీర్ఘమైన ర్యాలీలు, అద్భుతమైన స్మాష్‌లతో పాటు అంతకుమించి సొగసైన రిటర్న్‌ షాట్లతో సింధు అలరించింది.


2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఒకుహారాతో జరిగిన ఫైనల్‌ పోరులో ఓటమి పాలైన సింధు అందుకు ప్రతీకారం తీర్చుకుంది.  ఈ గెలుపుతో ఒకుహారా లెక్కను సరిచేసింది సింధు. ఒకుహారా ఆటపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన సింధు దానిని కోర్టులో అమలు చేసింది. ఆరంభం నుంచి దూకుడును ప్రదర్శించిన సింధు.. ప్రతీ పాయింట్‌ కోసం శ్రమించింది. ఎలాగైన స్వర్ణం సాధించాలనే కసితో సింధు ఆట తీరు సాగింది.  ఫైనల్‌ ఫోబియాకు చెక్‌ పెట్టాలనే ఏకైక లక్ష్యమే ఆమెకు స్వర్ణాన్ని తెచ్చిపెట్టింది.


ప్రపంచ వేదికపై తాను విజేతగా నిలవడంపై సింధు ఎంతో ఆనందంతో ఉద్వేగానికి లోనైంది. ఫైనల్‌ ఫోబియాకు ఎట్టకేలకు చెక్‌ పెట్టానని తెలిపింది తెలుగు తేజం. ఈ విజయం పట్ల ఓ ఇండియన్‌ గా ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నానని వెల్లడించింది. మరోవైపు సింధు సాధించిన విజయంపై ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు.సింధు విజయం పట్ల ఆమె కుటుంబసభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తన హార్డ్‌వర్క్‌ ఆమెకు పతకాన్ని తెచ్చిపెట్టిందన్నారు సింధు తల్లి విజయ. 


సింధు ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు నెగ్గిన క్రీడాకారిణిగా.. చైనా ప్లేయర్‌ జాంగ్‌ నింగ్‌ రికార్డును సమం చేసింది. సింధు విజయానికి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సింధు క్రీడాస్ఫూర్తి దేశానికే గర్వకారణంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇక ప్రధాని మోడీ అయితే భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన సింధును ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగురాష్ట్రాల గవర్నర్లు నరసింహన్, బిశ్వభూషన్ హరిచందన్, ఇక ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సింధు అసాధారణ విజయాన్ని కొనియాడారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: