యాషెస్‌ సిరీస్‌లో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌కు చిరస్మరణీయ విజయం అందించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతి ఒక్కరూ అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్ సంచ‌ల‌న రీతిలో ట్వీట్ చేశారు. తనకే ఓ సోదరి ఉంటే కచ్చితంగా బెన్‌ స్టోక్స్‌ కు ఇచ్చి పెళ్లి చేసేవాడినని చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు. బెన్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చేసిన కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


ఆసీస్‌తో మూడో టెస్టులో 359 పరుగుల లక్ష్యఛేదనలో ఓటమి అంచున నిలబడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆఖరి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అద్వితీయమైన విజయం అందించాడు. దీంతో బెన్ స్టోక్స్‌ను ప్ర‌శంసించే క్ర‌మంలో...‘నాకు అక్కాచెల్లెల్లు లేరు. కానీ నాకే ఓ సోదరి ఉంటే మాత్రం అతడికిచ్చి పెళ్లి చేస్తాను’ అని తెలపడంతో  అతడి కామెంట్స్ ట్విటర్‌లో వైర‌ల్ అయ్యాయి. స‌హ‌జంగానే నెటిజ‌న్లు అదే రీతిలో స్పందిస్తున్నారు. 


‘స్వాన్‌.. నేనే అతడిని పెళ్లి చేసుకోవాలని నా భావన’, అని ఒక‌రు చిలిపిగా స్పందించారు. ‘నాకైతే చెల్లెల్లు లేరు. కానీ ఒకరిని దత్తత తీసుకోవాలని మా అమ్మను అడుగుతాను, అతడికిచ్చి పెళ్లిచేయమంటాను’ అని ఇంకొక‌రు స్పందించారు. ఇంకొక‌రు ‘నాకేం ఆలోచనలు లేవు. బెన్‌ స్టోక్స్‌ ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని అనుకుంటున్నాను’, అంటూ త‌న ప్రేమ‌ను చాటుకున్నారు. ఇంకొక‌రు బెన్‌ను ఇరికించేటా చేశారు.  ‘ఇది 21వ శతాబ్దం స్వాన్‌, నువ్వే అతడిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఆ వరుసలో ఉండొచ్చు’ అని స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాన్ని పేర్కొంటూ ఇంకో నెటిజ‌న్ కామెంట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: