భారత్ లో క్రీడాకారులకు, ప్రతిభకు కొదవ లేదు. సరైన ప్రోత్సాహకం లేకపోవటం, ఆర్ధిక స్థితి సహకరించకపోవడం, మెరుగైన వసతులు లేకపోవడంతో దేశంలో ఎంతో మంది తమ వద్ద ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు విద్యార్ధులు తమ జిమ్నాస్టిక్ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పి ఔరా అనిపిస్తున్నారు. వీరు చేసిన జిమ్నాస్టిక్ విన్యాసాలకు ప్రపంచ దిగ్గజ జిమ్మాస్ట్, ఐదుసార్లు ఒలింపిక్ స్వర్ణ విజేత రొమేనియాకు చెందిన నాదియా కొమినెసి ఆశ్చర్యపోయారు. ఇది అద్భుతం అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 


ఇద్దరు విద్యార్ధులు స్కూలుకు వెళ్తూ ఎంతో కష్టమైన జిమ్నాస్టిక్ విన్యాసాన్ని ఎంతో సులభంగా చేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఎక్కడ తీసారో, ఏ రాష్ట్రం, ఊరు అనేది తెలియనప్పటికీ వీరి విన్యాసం అబ్బురపరుస్తోంది. ఎంతో ట్రైనింగ్ ఉంటే కానీ సాధ్యం కాని దానిని వీరు అత్యంత సులభంగా చేశారు. నాదియో కొమినెసి షేర్ చేసిన ఈ వీడియో సాక్షాత్తూ మన దేశ క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజుకు చేరింది. ఈ వీడియోలో విద్యార్ధుల ప్రతిభను చూసి ఆయన అచ్చెరువొందారు. వెంటనే తన ట్విట్టర్ లో నాదియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘వీరిని నాకు పరిచయం చేయండి’ అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసినందుకు కొమినెసికి కృతజ్ఞతలు తెలిపారు.

 


ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వీరి విన్యాసాలకు ఫిదా అయిన నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. దాదాపు 5లక్షల మందికి పైగా చూసిన ఈ వీడియోతో ‘దేశంలో ప్రతిభకు కొదవ లేదు.. వెలికితీయాలంతే’ అనే ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి మట్టిలో మాణిక్యాల్ని సానబెడితే క్రీడల్లో దేశం మరింత ముందుకెళ్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: