శ్రీలంక వెట‌ర‌న్ పేస్ బౌల‌ర్ ల‌సిత్ మ‌లింగ 20-20లో రెచ్చిపోయాడు. ఎవ్వ‌రి న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో అంత‌ర్జాతీయ రికార్డులు న‌మోదు చేశాడు. న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో మలింగ చెలరేగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లను రెండుసార్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే 20-20 మ్యాచ్‌ల‌లో 100 వికెట్లు ప‌డ‌గొట్టిన ఏకైక బౌల‌ర్‌గా కూడా మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.


ఇటీవ‌లే అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన 36 ఏళ్ల మలింగ తాజా మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హో‌మ్ (0), రాస్ టేలర్ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు. ఈ హ్యాట్రిక్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా మ‌రో ప్రపంచ రికార్డు సృష్టించాడు.


అంతేకాదు, టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గానూ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ షాహిద్ అఫ్రిది (97) పేరుపై ఉన్న రికార్డును బద్దలుగొట్టాడు. అంటే ఒక్క మ్యాచ్‌లో మూడు అంత‌ర్జాతీయ రికార్డుల‌కు మ‌లింగ చెక్ పెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అనంతరం 126 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 88కే ఆల‌వుట్ అయ్యింది.


ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో మలింగ మ్యాజిక్ ప్రారంభమైంది. మూడో ఓవర్ మూడో బంతికి మన్రోను బౌల్డ్ చేసిన మలింగ.. రెండో బంతికి రూథర్‌ఫర్డ్, మూడో బంతికి గ్రాండ్‌హోమ్, నాలుగో బంతికి రాస్ టేలర్‌లను వరుసగా పెవిలియన్ పంపాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: