దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి మొహాలి వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ని గెలిపించిన రికార్డుల రారాజు, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డ్ నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 72 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌‌గా రోహిత్ శర్మ 2,434 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. మొహాలి టీ20లో 72 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ 2,441 పరుగులతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి నెం.1 స్థానానికి ఎగబాకాడు.

రోహిత్ 97 టీ20 మ్యాచ్‌ల్లో ఈ రికార్డ్ స్కోరుని సాధించగా.. విరాట్ కోహ్లీ కేవలం 71 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. బెంగళురు వేదికగా ఆదివారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో నెం.1 స్థానం కోసం రోహిత్ శర్మ, కోహ్లీ మళ్లీ పోటీపడనున్నారు.

ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య పరుగుల వ్యత్యాసం కేవలం 7 రన్స్ మాత్రమే..!విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఈ రికార్డు జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (2,283), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (2,263), న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కలమ్ (2,140) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

అంతర్జాతీయ టీ20 హాఫ్‌ సెంచరీల్లో సైతం రోహిత్‌ను అధిగమించాడు కోహ్లి.  ఇప్పటివరకూ రోహిత్‌ శర్మ 21 అర్థ శతకాలు సాధిస్తే, కోహ్లి దాన్ని సవరించాడు. కోహ్లి 22 అంతర్జాతీయ హాఫ్‌ సెంచరీలతో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో వరుసగా మార్టిన్‌ గప్టిల్‌(16), బ్రెండన్‌ మెకల్లమ్‌(15), క్రిస్‌ గేల్‌(15)లు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: