వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్‌ ఓవర్‌లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లండ్‌ విజేతగా నిర్ణయించారు. ఒక వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ బౌండరీ కౌంట్‌ రూల్‌ ఆధారంగా విజేతను నిర్ణయించడమనేది ఇదే తొలిసారి కూడా.

అయితే  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) అవలంభిస్తున్న ఈ రూల్‌పై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘బౌండరీ రూల్‌’ స్థానంలో మరిన్ని ఓవర్ల మ్యాచ్‌ జరపాలనే యోచనలో ఐసీసీ ఉంది. కాగా, క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ముందుగానే బౌండరీ రూల్‌ను మార్చేసింది. దీనిని ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌) తాజా సీజన్‌ నుంచి అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది.

2019-20 సీజన్‌లో జరుగనున్న బీబీఎల్‌లో బౌండరీ కౌంట్‌  రూల్‌ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఒక వేళ ఫైనల్‌ మ్యాచ్‌లో విజేతను తేల్చేక‍్రమంలో ఆ మ్యాచ్‌ టైగా ముగిస్తే ముందుగా సూపర్‌ ఓవర్‌ను వేయిస్తుంది.అది కూడా టైగా ముగిసిన నేపథ్యంలో మరికొన్ని సూపర్‌ ఓవర్ల ద్వారానే విజేతను నిర్ణయిస్తారు. ఇక్కడ పూర్తి  స్పష్టత వచ్చే వరకూ సూపర్‌ ఓవర్లను కొనసాగించాలనే ప్రయోగానికి సిద్ధమైంది.

దీన్ని పురుషుల బీబీఎల్‌తో పాటు మహిళల బీబీఎల్‌లో కూడా కొనసాగించనున్నట్లు ఆ లీగ్‌ చీఫ్‌ అలిస్టర్‌ డాబ్సన్‌ తెలిపారు. ‘ ఐసీసీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత బౌండరీ కౌంట్‌ రూల్‌పై పెద్ద దుమారమే నడిచింది. దాంతో పలు సూపర్‌ ఓవర్ల విధానాన్ని తీసుకు రావాలని భావిస్తున్నాం. ఇది సక్సెస్‌ అవుతుందనే ఆశిస్తున్నాం’ అని డాబ్సన్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: