టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. నిన్న బుమ్రా.. నేడు హార్ధిక్‌ గాయాలతో ఆటకు దూరమయ్యారు. టాప్‌ ప్లేయర్స్‌ ఒకరు వెంట మరొకరు జట్టుకు దూరమైతే టీమిండియాకు ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఏడాది టీ-20 వరల్డ్‌ కప్‌ ఉండటంతో .. ఈ గాయాలు బీసీసీఐని టెన్షన్‌ని పెడుతున్నాయి.


కోహ్లీసేనను గాయాల సమస్య వేధిస్తోంది. కీలక ఆటగాళ్లు ఒకొక్కరుగా గాయాలతో ఆటకు దూరమవుతున్నారు. ఆటగాళ్లపై పని భారాన్ని తగ్గిస్తూ.. తగినంత విశ్రాంతి ఇస్తున్నా సరే.. గాయాల సమస్య వీడట్లేదు. ఇప్పటికే టీమిండియా మెయిన్‌ ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను నొప్పితో జట్టుకు దూరమయ్యాడు. అయిదారు వారాల పాటు అతడు టీమ్‌కి అందుబాటులో ఉండడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఆల్‌రౌండర్‌ హార్ధిక్ చేరాడు.


హార్ధిక్‌ పాండ్యను దీర్ఘకాలికంగా వేధిస్తున్న వెన్ను నొప్పి ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. గత ఏడాది  ఆసియా కప్‌ సమయంలోనే హార్ధిక్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని అతడిపై పని భారం పడకుండా తగినంత విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. ప్రపంచకప్‌ తర్వాత విండీస్‌ పర్యటనకు దూరంగా ఉన్నాడు ఈ బరోడా ఆల్‌రౌండర్‌. ఇటీవలి దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో ఆడిన అతడిని.. టెస్టులకు దూరం పెట్టారు. వచ్చే నెల ఆరంభంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ అందుబాటులోకి వస్తాడని భావిస్తుండగా.. ఈలోపు గాయం తిరగబెట్టి 5 నెలలు ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. 


బుమ్రాలానే హార్ధిక్ ది వెన్ను గాయమే కాగా.. తీవ్రత ఎక్కువ అని తెలుస్తోంది. అతడికి శస్త్రచికిత్స అవసరం కావొచ్చని బీసీసీఐ తెలిపింది. హార్ధిక్  జర్మనీకి పంపే అవకాశాన్ని కూడా బీసీసీఐ పరిశీలిస్తోంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం 2020  ఐపీఎల్‌ లోపు అతడి జట్టులోకి వచ్చే అవకాశం లేదు. ఇలా టాప్‌ ప్లేయర్స్‌ గాయాల బారిన పడటం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: