వైజాగ్ వేదికగా సౌత్ఆఫ్రికా తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీం ఇండియా  పట్టు బిగిస్తుంది.  202పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. 7వికెట్లు కోల్పోయి  502పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.  ఓపెన్లరు  రోహిత్ శర్మ (176), మయాంక్ అగర్వాల్ (215)  స్వేచ్చగా ఆడి  పరుగుల వరద పారించారు.  ఫలితంగా  భారత్  భారీ స్కోర్ సాధించింది.   వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 300పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  మొదటి రోజు లాగానే రెండో రోజు కూడా  వీరిద్దరు సులువుగా పరుగులు రాబడుతూ స్కోర్  బోర్డు ను పరుగులు పెట్టించారు.  ఈక్రమంలో మయాంక్  కెరీర్ లో  మొదటి శతకాన్ని సాధించాడు. అయితే  డబుల్ సెంచరీ దిశగా  సాగుతున్న రోహిత్ ను డికాక్ స్టంప్ అవుట్ చేయడంతో భారత్ మొదటి  వికెట్ ను కోల్పోయింది.  ఆతరువాత కాసేపటికే  పుజారా , కోహ్లీ  లు పెవిలియన్ కు చేరగా మరో ఎండ్ లో మయాంక్ సాధికారికంగా  ఆడి  ద్విశతకాన్ని పూర్తి చేశాడు. అయితే స్కోర్ పెంచాలనే ఉద్దేశం తో వేగంగా ఆడిన  మయాంక్ క్యాచ్ అవుట్ కాగా  కాసేపటికే   రహానే , విహారిలు  కూడా స్వల్ప స్కోర్ కే  వెనుదిరిగారు. ఆతరువాత జడేజా(30*) , అశ్విన్(1*) తో కలిసి  భారత్ స్కోర్ ను 500 దాటించాడు.  దాంతో  కోహ్లీ ఇన్నింగ్స్ ను డిక్లేర్   చేశాడు.   సౌత్ ఆఫ్రికా బౌలర్ల లో మహారాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. 



ఇక  అనంతరం  మొదటి ఇన్నింగ్స్ ను  ఆరంభించిన దక్షిణాఫ్రికా  కు ఆరంభంలోనే  షాక్ తగిలింది. అద్భుతమైన బంతి తో  ఓపెనర్  మార్ క్రామ్ ను  అశ్విన్ బోల్డ్ చేశాడు.   దాంతో 16పరుగులకే సౌత్ ఆఫ్రికా  మొదటి వికెట్ కోల్పోయింది.  ఈదశలో ఎల్గర్  కు జత కలిసిన డీ  బృయెన్  కాసేపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.  అయితే మరోసారి బౌలింగ్ కు దిగిన  అశ్విన్  ... డీ బృయెన్  ను బోల్తా కొట్టించగా .. నైట్ వాచ్ మెన్ గా వచ్చిన స్పిన్నర్ పెడ్త్ ను  జడేజా  అవుట్ చేసాడు. ఫలితంగా మ్యాచ్ ముగిసే సరికి  దక్షిణాఫ్రికా  రెండో రోజు 3వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.  ఎల్గర్ 27పరుగులతో బవుమా 1 పరుగుతో క్రీజ్ లో వున్నారు. భారత బౌలర్ల లో అశ్విన్ రెండు వికెట్లు తీయగా  జడేజా 1 వికెట్ పడగొట్టాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: