వైజాగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. ఫ్రీడం సిరీస్‌పై కన్నేసింది. పుణె వేదికగా రేపటి నుంచి ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌ కోసం కోహ్లీసేన రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఎగరేసుకుపోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ టెస్ట్‌లోనైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని సఫారీ టీమ్‌ పట్టుదలగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్‌ టేబుల్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా మరో ఫైట్‌కి రెడీ అయింది. ఫ్రీడమ్‌ సిరీస్‌లో మొదటి టెస్ట్‌లో అలవోకగా విక్టరీ కొట్టిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్‌కి సిద్దమైంది. సఫారీ టీమ్‌ సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ నిలవాలన్న కసితో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ టీమిండియాకిది రెండో టెస్ట్‌. 2017లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో.. ఆస్ట్రేలియా 3 వందల 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ టెస్టుని కోహ్లీసేన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.


టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్‌, మయాంక్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. అరంగేట్రంలోనే ఓపెనర్‌గా చెలరేగిన రోహిత్‌.. ఈ మ్యాచ్‌లోనూ రాణిస్తే టీమిండియాకి తిరుగుండదు. కోహ్లీ, పుజారా, రహానే స్థాయికి తగ్గట్టు ఆడితే.. సఫారీ టీమ్‌కి కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో టీమిండియా బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. అశ్విన్‌, షమీ, జడేజా సూపర్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. లంబూ ఇషాంత్‌ వైజాగ్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. కానీ, అతడి బౌలింగ్‌పై ఎటువంటి సందేహాలు లేవు. పుణె మ్యాచ్‌లో ఇషాంత్‌ తిరిగి లయ అందుకుంటాడని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.


మరోవైపు సఫారీ టీమ్‌కి ఉపఖండపు కష్టాలు తప్పేలా లేవు. వైజాగ్‌ మ్యాచ్‌లో ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించినా.. సఫారీ బ్యాట్స్‌మెన్‌ చివరి రోజు చేతులేత్తేశారు. ఎల్గర్‌, డుప్లెసిస్‌, డికాక్‌ రాణిస్తేనే సఫారీ టీమ్‌ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రొటీస్‌ బౌలింగ్‌ మొదటి మ్యాచ్‌లో పూర్తిగా వైఫల్యమైంది. ముగ్గురి స్పిన్నర్ల వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టింది. ఫిలాండర్‌, రబాడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేసినా.. వికెట్లు తీయలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించాలని సఫారీ బౌలర్లు భావిస్తున్నారు.


ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించనున్నాడు.  విరాట్‌ కోహ్లీకి కెప్టెన్‌గా ఇది 50 వ మ్యాచ్‌. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఇరు జట్లు 37 సార్లు తలపడగా.. టీమిండియా 12 సార్లు గెలవగా, దక్షిణాఫ్రికా 15 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరో పది మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. పుణె పిచ్‌ మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కి..తరువాత స్పిన్‌ బౌలింగ్‌కి అనుకూలించనుంది. దీంతో ఇరు జట్లు మరోసారి స్పిన్‌ వ్యూహాంతోనే బరిలోకి దిగాలని భావిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: