ఆతిధ్య ఇంగ్లాండ్  జట్టు విశ్వవిజేతగా ఆవిర్భవించడానికి  అదృష్టం దోహదపడిందన్నది జగమెరిగిన సత్యమే . అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసీసీ)  ప్రపంచ కప్ ఫైనల్ లో  న్యూజిలాండ్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్,  తొలుత టై గా ముగిసిన విషయం తెల్సిందే . మ్యాచ్  విజేత ను  నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ఆడించగా ,  అది కూడా టై  కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టును నిర్వాహకులు  విజేతగా ప్రకటించారు.


 బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడాన్ని క్రికెట్ అభిమానులు , క్రీడా పండితులు తీవ్రంగా వ్యతిరేకించారు . ఇదేమి నిబంధన అంటూ తిట్టిపోశారు . ఐసీసీ తరుచూ, నిబంధనలను సడలిస్తూ , క్రికెట్ మరింత జనరంజకంగా ఉండేలా చర్యలు చేపడుతూ వస్తోంది . దానిలో భాగంగానే తీవ్ర  విమర్శలకు దారితీసిన సూపర్ ఓవర్ నిబంధనను కూడా మార్చాలని నిర్ణయించింది . తాజాగా జరిగిన   ఐసిసి పాలకమండలి సమావేశం లో ఈ మేరకు  దిద్దుబాటు చర్యలు చేపట్టింది .  సెమీ ఫైనల్ ఫైనల్ మ్యాచ్ లలో మ్యాచ్ టై గా ముగిసి , ఫలితం కోసం  సూపర్ ఓవర్ ను ఆశ్రయిస్తే ,   ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్ లను  ఆడిస్తూ నే ఉండాలని నిర్ణయించింది.


 ఐసీసీ ఫైనల్ లో ఎదురైన అనుభవాన్ని దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది . నాకౌట్  దశలో ఇప్పటి వరకు మ్యాచ్ టై గా ముగిస్తే  సూపర్ ఓవర్లను ఆడిస్తుండగా , ఇకపై లీగ్  దశలోనూ ఆడిస్తారు.   సూపర్ ఓవర్ కూడా టై అయితే ఆ  మ్యాచ్ ను  టైగానే  పరిగణిస్తారు.  మరోమారు సూపర్ ఓవర్ ఆడించడం అన్నది జరగదని ఐసీసీ ప్రకటించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: