భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా నియామకం ఖాయమైన దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ టీమిండియా ఆటతీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నమెంట్లలో చివరి దశలో ఓటమి చవిచూస్తున్నారని, దీనిని అధిగమించడంపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాకౌట్‌లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. 
అయితే, గంగూలీ ఈ విషయాన్ని నొక్కి చెప్పనప్పటికీ ఐసీసీ టోర్నీలో కడవరకు నిలిచి విజేతగా నిలవాలని ఆకాక్షించాడు. ‘ఇండియన్‌ టీమ్‌ పటిష్టంగా ఉంది. అయితే, వారు ఇటీవల జరిగిన ఐసీసీ టోర్నమెంట్లలో విజయం సాధించలేకపోతున్నారు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో బోల్తా పడుతున్నారు. విరాట్‌ ఓ చాంపియన్‌. అతని సారథ్యంలో మన జట్టు మరింత మెరుగ్గా రాణించి విజయాల్ని సొంతం చేసుకుంటుంది’అని సౌరవ్‌ కోల్‌కతాలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. 
ఇక 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేదు. అదేవిధంగా.. కోహ్లి సారథ్యంలో టీమిండియా ఇంటాబయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది. విదేశీ గడ్డపై భారత్‌ పలు టెస్టు సిరీస్‌లను ఖాతాలో వేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అయితే, టోర్నీ చివరి దశకు వచ్చే సరికి భారత ఆటగాళ్లు ఒత్తిడికి గురువుతున్న మాట వాస్తవం. వరల్డ్‌ టీ20 కప్‌ (2016), ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి (2017), వన్డే వరల్డ్‌ కప్‌ (2019) టోర్నీల్లో టీమిండియా నాకౌట్‌ దశలోనే వెనుదిరగడం ఇందుకు ఉదాహరణ.


మరింత సమాచారం తెలుసుకోండి: