బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగారు . తమ డిమాండ్లను పరిష్కరించనిదే క్రికెట్ ఆడేది లేదని , అదేవిధంగా క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు . ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బి సీబీ )కు తమ 11  డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఒక లేఖ రాసినట్లు క్రికెట్ ఆటగాళ్లు   వెల్లడించారు . తాము రాసిన లేఖపై బీసీబీ సానుకూలంగా స్పందించకపోవడం వల్లే సమ్మెకు దిగినట్లు తెలిపారు .


 బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడం తో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ డైలమా లో పడింది . ఈ సిరీస్ లో భాగంగా బంగ్లా జట్టు మూడు టి ట్వంటీలు,  రెండు  టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది . నవంబర్ మూడవ తేదీన తొలి టి ట్వంటీ మ్యాచ్ జరగాల్సి ఉంది . అయితే అనూహ్యంగా బంగ్లా ఆటగాళ్లు సమ్మెకు దిగడం తో ఈ సిరీస్ కొనసాగుతుందా ? లేదా ?? అన్న అనుమానాలు నెలకొన్నాయి . ఇదే విషయమై బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్ గంగూలీ స్పందిస్తూ  బంగ్లా ఆటగాళ్ల సమ్మె , బీసీబీ అంతర్గత వ్యవహారమని , సిరీస్ జరిగి తీరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు .


ఇక బంగ్లా ఆటగాళ్లు చేస్తోన్న  సమ్మె లో దాదాపు 50  మంది క్రికెటర్లు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది . వీరికి షకిబుల్ హాసన్ , ముష్పికర్ రెహ్మాన్ లు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం . మైదాన సిబ్బంది జీత, భత్యాన్ని పెంచడం తో పాటు , ఆటగాళ్ల జీతాలు , ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజు పెంచాలని  బంగ్లా క్రికెటర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: