రాంచీలో  దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మరింత పదిలపర్చుకుంది. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు మొత్తంగా 60 వికెట్లు పడగొట్టగా అందులో పేసర్లు మొత్తంగా  26 వికెట్లు దక్కించుకున్నారు.  పేస్ బౌలర్లలో మహ్మద్‌ షమీ 13 వికెట్లతో రఫ్పాడించాడు.  కేవలం చివరి రెండు టెస్టులు ఆడిన ఉమేశ్‌ యాదవ్‌ 11 వికెట్లు పడగొట్టి ఆశ్చర్యపరిచాడు. బౌలర్లతో పాటు ఈ సిరీస్ లో టీమిండియాకు  టెయిలెండర్లు బ్యాట్‌తో రాణించడం సానుకూలంగా మారింది.  రాంచీ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ సిక్సర్ల మోతతో పాటు షమీ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది.


   రాంచీ టెస్టు తర్వాత మీడియాతో మాట్లాడిన పేస్ బౌలర్ మహ్మమద్ షమీ తమ ఆటతీరుపై స్పందించాడు.  ఈ సిరీస్ లో మా పేస్ బౌలర్లు బ్యాట్ తో కూడా రాణించడం సంతోషంగా ఉంది. గతంలో మేము బ్యాటింగ్‌ చేసేటప్పుడు ప్రత్యర్థి బౌలర్లు మమ్మల్ని భయపెట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు  మారాయి. మేము బ్యాట్‌తో సమాధానం చెప్పగలమని నిరూపించుకున్నాం అని పేర్కొన్నాడు. మేము బ్యాటింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బౌలర్లు భయపడటం, మా టీమ్ సభ్యులు ఆనందపడటం కూడా చాలా ఆనందాన్నిచ్చిందని షమీ పేర్కొన్నాడు. 


అటు రాంచీ టెస్టులో తన సిక్సర్ల వర్షంపై  ఉమేశ్‌ యాదవ్‌ స్పందించాడు.  చాలా కాలం విరామం తర్వాత మ్యాచ్ ఆడాను. బ్యాటింగ్ కు వెళ్లేముందు బంతిని బాదమని కెప్టెన్ విరాట్ నాకు సూచించాడు. రెండు ఇన్నింగ్సుల్లో బ్యాట్ తో రాణించడం, బంతితో రాణించడం నాకు చాలా ఆనందం కలిగించింది. అని ఉమేశ్ వెల్లడించాడు. 


మరోవైపు  ఈ సిరీస్ లో భారత బౌలర్ల ప్రదర్శన  కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలతో ముంచెత్తాడు. స్పిన్ ట్రాక్ లపై పేసర్లు వికెట్లు పడగొట్టడం, ప్రత్యర్థి బౌలర్లు విఫలమైన దగ్గర మన బౌలర్లు రాణించడం గొప్ప విషయమన్నాడు.  ఇలాంటి ప్రదర్శనను వచ్చే సిరీస్ లలో కూడా బౌలర్లు కొనసాగించాలని శాస్త్రి పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: