భారత క్రికెట నియంత్రణ మండలి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా తన తొలి సమావేశంలోనే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  బుధవారం జరిగిన బోర్డు సర్వసభ్య సమావేశంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన దాదా..  టీమిండియాను మరింత పటిష్ట జట్టుగా మార్చే అంశాలతో పాటు, జట్టులో ఉన్న సమస్యలు, మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ అంశంపై పలు అంశాలపై మీడియాతో ముచ్చటించాడు. 


      అధ్యక్షుడిగా తాను కెప్టెన్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రిలతో సన్నిహితంగా మెలుగుతానని తెలిపాడు. అలాగే జట్టును మరింత బలంగా తయారు చేసేందుకు కావాల్సిన అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు దేశవాళీ క్రికెట్ ను మరింత బలోపేతం చేస్తామన్నాడు.  టీమిండియాను ప్రంపచంలోనే అత్యుత్తమ జట్టుగా మార్చాలని కోహ్లీ భావిస్తున్నట్లు తెలిపిన దాదా.. కెప్టెన్ గా కోహ్లీ సూచనలను, సలహాలను గౌరవిస్తానని వెల్లడించాడు. దీంతో పాటు ఐసీసీ నుంచి బీసీసీఐకి రావాల్సిన నిధులపై కూడా చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నాడు. జట్టు మేనేజ్ మెంట్ తో పాటు కోహ్లీ, శాస్త్రిల సహకారాన్ని కూడా తాను ఆశిస్తున్నట్లు వెల్లడించిన దాదా.. ప్రస్తుత భారత జట్టు ఆటతీరు అద్భుతంగా ఉందని ప్రశంసించాడు.


 అటు ధోనీ రిటైర్మెంట్ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు దాదా ఆసక్తికర సమాధానమిచ్చాడు.  భారత క్రికెట్ కు అద్భుత విజయాలతో పాటు రెండు వరల్డ్ కప్ లు అందించిన ధోనీ సేవలు ప్రత్యేకమైనవన్న గంగూలీ.. ఎప్పటికీ ధోనీ టీమిండియాకు స్పెషల్ ఆటగాడేనన్నాడు. ధోనీ రిటైర్మెంట్ అంశంపై టీమ్ మేనేజ్ మెంట్ తో పాటు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవి శాస్త్రిలతో చర్చించాకే. ధోనీని సంప్రదిస్తాననన్నాడు.  


ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటన చేయాలనే అంశాన్ని ధోనీకే వదిలేయాలని భావిస్తున్నట్టు దాదా తెలిపాడు.   కాగా బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీకి పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: