నల్లగా మేఘాలు పడితే వాన పడుతుందేమో అని ఆశగా ఎదురుచూడటం తప్పించి ఒక్క చుక్క కూడా రాలడం లేదని ఆ జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనే కాదు కడప జిల్లాలోనూ అదే పరిస్థితి. ఇంకా అక్కడ పరిస్థితి ఎండాకాలాన్ని తలపిస్తుంది. వానలు సకాలంలో పడితే ఈ పాటికి దుక్కులు దున్ని విత్తనాలు వేసి మొలకలు రావలసిన పరిస్థితి. కానీ చినుకులు రాలకపోవటంతో రైతు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఈ సంవత్సరమైనా బీడు తడిస్తే పేరుకుపోయిన అప్పులు కొన్నైనా  తీరతాయన్న ఆశతో ఉన్న అన్నదాతకు నిరాశే మిగిలింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పలకరిస్తున్నాయి. కాని కడప గడపలోకి ఇంకా అడుగుపెట్టలేదు.



వాన దారలు కురిసి కొన్ని నెలలు గడిచి పోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కరువే, సాగు నీరు లేక తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరక్క జిల్లా అంతటా ఖరీఫ్ మొదలైన ఇక్కడ ఇంకా ప్రారంభమే కాలేదు. సాధారణ వర్షపాతం కంటే ఇక్కడ ముప్పై తొమ్మిది శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో సాగు మాట దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. పంట భూముల్లో తడారిపోయింది. యాభై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతులు, ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు. ధైర్యం చేసి సాగుకు దిగాలంటే భయపడిపోతున్నారు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం సగటున నూట డెబ్బై రెండు మిల్లీమీటర్లు అయితే ఇప్పటి వరకు కేవలం నూట నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.




ఇప్పటికే వర్షాలు ఉన్నట్లయితే ఇరవై ఆరు వేల హెక్టార్ లలో వేరు శనగ, ఇరవై నాలుగు వేల హెక్టార్ లలో పత్తి పంటలు సాగయ్యేది. కాని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. వర్షాలు లేకపోవటంతో ఎక్కడికక్కడ పొలం పనులు ఆగిపోయాయి. దుక్కులు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకొని రెడీగా ఉన్న రైతులు వానలు లేక తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. వర్షాలే లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే సర్కార్ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అప్పో సప్పో చేసి విత్తనాలు కొన్నాం. సేద్యం ఆలస్యమవుతుండటంతో విత్తనాలకు పురుగు పడుతుందని వాపోతున్నారు.



చివరకు జిల్లాలో గడ్డి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పశువుల్ని కూడా సాకలేక అమ్ముకుంటున్నారు. జిల్లాలో డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటే వ్యవసాయ పనులు మొదలయ్యే అవకాశాలుంటాయి. కానీ అంతమాత్రం వర్షాలు కూడా లేకపోవటంతో పనులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బావుల కింద కూడా సేద్యం అంతంత మాత్రంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. నీటి ఊటలు ఎండిపోయాయి. చివరకు వాళ్ళ కన్నీరు కూడా ఇంకిపోతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎంతో మంది చేసేది లేక వానల కోసం ఎదురు చూసీ చూసీ విధిలేని పరిస్థితుల్లో సొంత ఊళ్లను వదలిపెట్టి బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: