నీళ్ల బిందె నుండి మందు బాటిల్‌ వరకు అంతా ప్లాస్టిక్‌ మయం అయిపోయింది. ప్లాస్టిక్‌ లేనిదే బతుకు లేదన్నట్టుగా తయారైంది మానవ జీవితం. దీనికి ప్రత్యామ్నాయాలు లేవా? కాలుష్యం పెంచుత్ను ప్లాస్టిక్‌ నుండి నేలను కాపాడలేమా అంటే? దానికి వెదురు వనాలే, చక్కని పరిష్కారం అంటోంది తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ. .

 ప్లాస్టిక్‌ కు చెక్‌ చెప్పేందుకు, వెదురును ప్రోత్సహించేలా వెదురు వనాల ఏర్పాటుకు ఆ శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. వెదురు మొక్కల పెంపకం, వెదురు ఆధారిత కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం ఏర్పాటైన ' నేషనల్‌ బాంబూ మిషన్‌ ప్రాజెక్టు ' లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8.3 లక్షల వెదురు మొక్కలను పెంచేందుకు ఉద్యాన శాఖ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా రూ. 11కోట్లు ఖర్చు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్‌ అయింది. ఉద్యానశాఖ ద్వారా గిరిజనులకు , రైతులకు, అవగాహన కల్పించి ,పొలం సరిహద్దుల్లో , గట్ల పై వెదురు మొక్కలను పెంచేలా పేదలను ప్రోత్సహించాలని భావిస్తోంది. 

 మొక్కకు రూ.40 ఖర్చు ఒక్కో మొక్కను పెంచేందుకు రూ. 240 చొప్పున ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్యాన శాఖ నడుం బిగించింది. మొక్కకు రూ. 35 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుంది. దానిని నాటడం దగ్గర్నుంచి, పెంచడం దాకా రూ. 240 ఖర్చవుతుందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. రైతుకు ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రాయితీ కల్పిస్తారు. 
 మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌, తదితర ఈశాన్య రాష్ట్రాల్లో జనం పెరట్లో వెదురును పెంచుతుంటారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మంలోని గిరిజన ప్రాంతాల్లో వెదురు వనాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. 

దశాబ్దాల దిగుబడి...

 వెదురు వనాలు ఒకసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. ప్లాస్టిక్‌ బాటిళ్లు, కుర్చీల బదులు వెదురుతో చేసిన వస్తువులను ఉపయోగంలోకి తెచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో వెదురుతో చేసిన కేన్‌ ఫర్నీచర్‌ కు చక్కని డిమాండ్‌ ఉంది. అల్మరాలు, సోఫాలు, టీపాయ్‌లు, హ్యాంగింగ్‌ చైర్లతో పాటు టోపీలు, పూల కుండీలు, విండో కర్టైన్లు తయారు చేయొచ్చు. 

 అటవీశాఖ అడ్డులేదు.
 గతంలో వెదురును పెంచాలన్నా, నరకాలన్నా, అటవీశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనను తీసేవేయడంతో వెదురు సాగుకు అవకాశాలు మెరుగయ్యాయి. వెదురువనాల పెంపకంలో గిరిజనులను, రైతులను భాగస్వాములు చేయడం, వైవిధ్య వస్తువుల తయారీలో శిక్షణ, దానిపై ఆధారపడిన కుటుంబాలకు నైపుణ్యాన్ని పెంచడం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టి, అవసరమైన వారికి సబ్సిడీ కింద రుణాలూ ఇచ్చి, వెదురు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేస్తే ప్లాస్టిక్‌ రహిత సమాజం సాధ్యమవుతుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: