భూగర్భ జలాలు అడుగంటి పోయి బోర్ల నుంచి నీరు రాక చాలా చోట్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే తమ గ్రామాల్లో మాత్రం మోటార్ లు ఆన్ చేయకుండానే పాతాళ గంగ పైకి వచ్చేసిందంటున్నారు ఆ గ్రామస్తులు. పంట పొలాలలోకి నీరు రావడంతో నష్టపోతున్నామని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి.వాటికి తోడు బోర్ల నుంచి చుక్క నీరు రాని పరిస్థితి అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని దామెర కుంట గ్రామంలో మాత్రం బోర్ల నుంచి ఆగకుండా నిరంతరం నీరు వస్తుందంటున్నారు అక్కడి రైతులు.సుమారు 10 బోర్ల నుంచి నీరు నిరంతరాయంగా పైకి ఉబికి వస్తూ ఉండటంతో పంట పొలాలలోకి వెళ్లి వ్యవసాయం చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రైతులు చెప్తున్నారు. అన్నారం బ్యారేజీలో రోజురోజుకి పెరుగుతున్న నీటి సామర్థ్యంతో గోదావరి నదికి ఆనుకొని ఉన్న తమ పంట పొలాలకు ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ నీటి సామర్థ్యం విలువ మొత్తం 10.87 టీఎంసీలు. ప్రస్తుతం ఈ బ్యారేజీలో 5.53 టీఎంసీల నీరు ఉంది.


అయితే ఇంత తక్కువ స్టోరేజీ ఉన్నప్పుడే దామెర కుంట గ్రామంలో బోరు బావుల నుండి నీరు ఇలా ఉబికి వస్తూ ఉంటే ఇక నీటి సామర్థ్యం పెరిగే కొద్దీ తమ ఊరు పరిస్థితి ఏంటని గ్రామంలోని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రైతు మాట్లాడుతూ, 'కరకట్టను పోలి చెరువు ఆ కరకట్ట పక్కనపడి ఒక 10 మోటార్ ల నీళ్లు పోతుండేవి అటువెళితే ఎడ్లు దిగబడుతున్నాయి, మనషులు దిగుబడుతున్నారు, బాగా హానికరంగానే ఉన్నది. మా గ్రామానికి ఇంతకు ముందే ఇబ్బంది ఉన్నది, ఇప్పుడు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి అని అనంగ కూడా ఈ రకంగా ప్రయత్నం చేసేందుకు మాకేదో మేలవుతుందంనుకుంటే మా ఊరికి కీడే కాని మేలైతే లేదు.


ఇప్పటికైనా మా గ్రామానికి కానీ, మా గ్రామ రైతులకే కానీ మేలు జరిగే ప్రపోజలు  రావాల్స్తే ఆ వరద రాకుంటా మా భూములు నష్టం కాకుండా ఏ రకంగా నిర్ణయం చేస్తదో గవర్నమెంటు ఆ రకంగా మాత్రం నిర్ణయం చేయాలని మా రైతుల కోరిక మా కోరిక'. ఈ పరిస్థితిని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నది పక్కన కరకట్టలకు ఆనుకుని ఉన్న భూములను సర్వేలు చేసి తమకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: