భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. మూడ్రోజులు పలు జిల్లాలను ఎడతెరిపి లేకుండా వాన ముంచెత్తుతుంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు ఏజెన్సీల్లోనూ జలపాతాల ఉరకలు వేస్తూ ఉండటంతో చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా వరద నీటితో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.


ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వాన పడుతుంది. ముఖ్యంగా ములుగు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వెంకటాపురం మండలం చిన్న గంగారం వద్ద పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడటంతో పంట పొలాలు నీట మునిగాయి. అటు ముల్లూరు వాగు పొంగి ప్రవహించటంతో వరద ఉద్రితికి రోడ్డు కొట్టుకు పోయింది.


దీంతో నర్సింహనగర్, శెనగ కుంట, పూడేరు పల్లి గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం ఉరకలు వేస్తోంది.100 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకుతుంది.ప్రవాహ ఉధృతికి జలపాతం వద్ద ఏర్పాటు చేసిన కంచె కొట్టుకుపోయింది. అటు లక్కవరం సరస్సుకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో పర్యాటకులు సరస్సు వద్ద సందడి చేస్తున్నారు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జనగామ జిల్లాలో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగైదు రోజులు వర్షాలకు జిల్లాలోని జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి.


కుంటాల జలపాతంతో పాటు పొచ్చెర వాటర్ ఫాల్స్ ను చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ లో నిన్నటి నుంచి ముసురు పట్టుకుంది. నార్కూర్ మండలం మహాదం వంతెనను వరద నీరు ముంచెత్తింది. గాదిగూడ మండలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బతుకమ్మవాగు, సుద్దాల వాగు, నీల్వాయి వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని మెజారిటీ మండలాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.కడెం, ఎల్లంపల్లి, కుమ్రం భీం, స్వర్ణ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతోంది. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.


దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద సీత వాగు ఉగ్రరూపం దాల్చింది. సీతమ్మ విగ్రహం పాదాల వద్దకు వరద నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులను నారచీరల ప్రాంతంలోకి అనుమతించట్లేదు. అటు దుమ్ముగూడెం మండలంలోని గుబ్బలమంగి వాగు రెండ్రోజులుగా పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మోకాళ్ల లోతు నీరు రోడ్డుపై పోటెత్తటంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లక్ష్మీపురం గౌరారం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.


యాదాద్రి, భువనగిరి జిల్లా చిన్నకొండూరులోని పిల్లాయిపల్లి కాలువకు గండి పడింది. దీంతో అధికారులు జేసీబీ సాయంతో గండిని పూడ్చారు. భారీ వర్షం కారణంగా సింగరేణిలోని పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయం కావడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు నిలిచిపోయాయి. కొత్తగూడెం పెద్దపల్లి మంచిర్యాలలోని పలు ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. విలీన మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చింతూరు మండలం ముకునూరు వద్ద సోకిలేరు వాగు పొంగి ప్రవహిస్తోంది.


చింతూరు నుంచి వీఆర్ పురం వెళ్లే రహదారిపై మోకాలి లోతుకు పైగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాలలో మోస్తరుగా వర్షాలు కురిసాయి. అటు విశాఖ ఏజెన్సీలో మూడ్రోజులుగా వీడకుండా కురుస్తున్న వర్షాలతో గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికీ ఆలస్యంగానైనా వరుణుడు కరుణించటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: