ప్ర‌ముఖ రియాల్టీషో బిగ్‌బాస్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. పోలీస్ స్టేష‌న్లు, కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా ఈ షో ఊహించ‌ని చిక్కుల్లో ప‌డుతోంది. తాజాగా మ‌రో పిటిష‌న్ బిగ్‌బాస్‌పై న‌మోదైంది. స్టార్‌ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రసారం చేస్తున్న బిగ్‌బాస్-3 కార్యక్రమాన్ని అడ్డుకోవాలని మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. అసభ్యకర ప్రవర్తన, నైతిక విలువలను దిగజార్చేలా ఉండే సన్నివేశాలను బిగ్‌బాస్ రియాల్టీషోలో ప్రసారం చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ చట్టాలను అనుసరించి ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేసిన తర్వాతే ప్రసారం అయ్యేలా ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తిచేశారు. సినీహీరో నాగార్జునతోపాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్‌ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (మాటీవీ), పోలీసులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కాగా, బిగ్‌బాస్ రియాల్టీషో నిర్వాహకులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.


బిగ్‌బాస్ టీవీ షో నిర్వాహకులు మహిళా స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించారని నటి గాయత్రిగుప్తా ఆదివారం రాత్రి బిగ్‌బాస్ యాజమాన్యంపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదుచేశారు. మణికొండలో నివాసముండే గాయత్రిగుప్తా కేసు వివరాలను అనంతరం మీడియాకు వెల్లడించారు. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొనేందుకు తనను గత ఏప్రిల్‌లో మా టీవీ తెలుగు చానల్ యాజమాన్యం సంప్రదించిందని, వారి ఇంటర్వ్యూ శైలి మహిళల స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉందని తెలిపారు. వందరోజులపాటు షోలో పాల్గొనేందుకు తనను ఎంపికచేసిన బిగ్‌బాస్ యాజమాన్యం ప్రతినిధులు.. మహిళల స్వేచ్ఛను హరించేలా మాట్లాడారని, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇదిలాఉండ‌గా, జులై 21 రాత్రి 9 గంట‌ల‌కు సీజ‌న్ 3 మొద‌లు కానుంది. ఇంకా 10 రోజులై స‌మ‌యం ఉండ‌టంతో స్టార్ మా యాజ‌మాన్యం కూడా ప్ర‌మోష‌న్ పెంచేస్తున్నారు. తాజాగా మ‌రో ప్రోమో విడుద‌ల చేసారు. ముందు వాటికంటే కూడా ఇప్పుడు విడుద‌లైన ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. మ‌నుషులు బ‌య‌ట ఎలా ఉంటారు.. కెమెరా క‌నిపిస్తే ఎలా న‌టిస్తారు అనేది ప్ర‌ధానంగా ఈ ప్రోమో డిజైన్ చేసారు. ఇది చూసిన త‌ర్వాత మూడో సీజ‌న్‌పై మ‌రింత ఆస‌క్తి పెరిగిపోవ‌డం ఖాయం. వ‌ర‌స‌గా మూడోసారి కూడా హోస్ట్ మార‌డంతో ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి అంద‌ర్లో క‌నిపిస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: