ఈ రోజుల్లో మన దైనందిన కార్యక్రమంలో మన గురించి ఆలోచించే సమయం కన్నా పక్క వాళ్ళకు జరిగే అనర్ధాలను మాత్రం నాటకీయంగా చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాం.  అటువంటి అనర్ధాలను టెలివిజన్ ఛానళ్ళు సీరియళ్ళ రూపంలో మనకు చూపెడుతూ మనల్ని టెలివిజన్ ముందు కట్టిపడేస్తున్నాయి. వయస్సు నిమిత్తం లేకుండా సాయంత్రమైతే రాత్రి పడుకోపోయే దాకా మనతో పాటు మన పిల్లల్ని కూడా ఈ అనర్ధాలు చూపించి మరీ నేర్పిస్తున్నాయి.  ఏ ఛానల్, ఏ సీరియల్ అయినా తీసుకోండి కక్ష్యలు కార్పణ్యాలు... పగలు ప్రతీకారాలతో సాటి మనిషిని సావకాశంగా నాశనం చేయడానికి శిక్షణ ఇస్తున్నాయి నేటి సీరియళ్ళు.  పైగా డెబ్భై శాతం సీరియళ్ళలో సదరు మహిళలనే విలన్లుగా చూపించడం మరీ విడ్డూరం.  ఇంతగా చెడును ప్రోత్సహించే ఈ సీరియళ్ళలో మా టీవిలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ ని మాత్రం మినహాయించొచ్చు.

కార్తీకదీపం సీరియల్ కథాంశం రొటీన్ అయినా కథను నడిపిస్తున్న తీరు, పాత్రలచే మాట్లాడిస్తున్న సంభాషణలు నిజంగా అభినందనీయం.  అసభ్య పదజాలం, అశ్లీల, హింసతో కూడుకున్న నేటి టీవి సీరియళ్ళలో నిజంగా కార్తీక దీపం చూసి ఎంతో నేర్చుకోవాలి.  సీరియల్ అన్నాక సాగదీత ఎంతో అవసరం. ఆ పరంగా చూస్తే కార్తీక దీపం సాగదీతకు మినహాయింపేమీ కాదు.  అయినా కాని ఈ సీరియల్ లోని సంభాషణలు చూసే ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాయి.  నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ నేటి ప్రేక్షకాభిరుచికి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఎపిసోడ్ మలిచిన తీరుతో ప్రేక్షక మనసుల్లో మాత్రం ఈ సీరియల్ అగ్రస్థానం సంపాదించింది.  వ్యాపార పరంగా లాభాలున్నాయో లేవో తెలీదు కాని చూసే ప్రేక్షకులకు మాత్రం వినోదంతో పాటు విలువలను చూపుతుంది ఈ సీరియల్.  ముఖ్యంగా ఈ సీరియల్ కథానాయిక దీప పాత్రను మలిచిన తీరు మనల్ని కదిలిస్తుంది.  జీవితంలో మనం అన్నీ కోల్పోయినా మనలోని ఆత్మవిశ్వాసమనే ఆయుధాన్ని వాడితే ఎంతటి కష్టాన్నైయినా సులువుగా ఎదుర్కోవచ్చని ఈ సీరియల్ లో దీప పాత్ర చెప్తుంది. 

ఆఖరుగా ఒక్క మాట. టీవిల ద్వారాగాని, మరే రూపంలో కాని మనం ప్రతిరోజూ మనతో పాటు, మన కుటుంబ సభ్యులకు కూడా ఎంతో చెడును చూడడానికి మనకు తెలీకుండానే ప్రోత్సహిస్తున్నాం. తెలిసి మంచిని మనం ఎందుకు చూపించకూడదు. ఆలోచించండి. నిజంగా ఈ గందరగోళ సీరియళ్ళలో కార్తీక దీపం నిజమైన కార్తీక దీపం.


మరింత సమాచారం తెలుసుకోండి: